Floods In Afghanistan: తాలిబన్ దేశమైన ఆఫ్ఘానిస్థాన్ భారీ వర్షాలతో అల్లల్లాడిపోతోంది. దీంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. భారీ వరదలకు అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాలు ఆఫ్ఘానిస్థాన్ ను ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలకు ఉత్తర ఆఫ్ఘానిస్తాన్ లో శుక్రవారం ఒక్కరోజే దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి తాలిబన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వరదల కారణంగా అనేక ఇళ్లు కొట్టుకుపోగా.. దాదాపు 100 మందికి పైగా గాయాలపాలైనట్లు వారు ప్రకటించారు.
బాగ్లాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ వరదల్లో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరదలు కారణంగా వేలాది ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని.. దీంతోపాటుగా మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.