Maldives President Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. మాల్దీవుల సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. అంతేకాదు.. ముఖ్యమైన భాగస్వామి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయంలో భారత్ ముందుంటుందని ప్రశంసించారు. అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యాల కల్పన విషయంలో భారత్ సహకరించింది. ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో కూడిన రుణాన్ని అందించింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముయిజ్జు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి. భారత్ తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. మాల్దీవుల పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: చిక్కుల్లో భారత్.. వార్ తప్పదా? మోదీ ప్లానేంటి?
ఇదిలా ఉంటే.. గతంలోనూ రుణ విముక్తి కోసం ముయిజ్జు విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. గతేడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు సుమారుగా 400.9 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దానిని చెల్లించడంలో ఉపశమనం కలిగించాలంటూ కొద్ది నెలల క్రితం ద్వీప దేశం ప్రాధేయపడగా, అందుకు ఇండియా ఓకే చెప్పింది. కాగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ముయిజ్జు హాజరయ్యారు.