Indian students Babysitters| అమెరికాలో ఉన్నత చదువులు కోసం వెళ్లిన భారత విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర కష్టాలుపడుతున్నారు. కాలేజీ ఫీజులు, ఇంటి అద్దె, ఇతరత్రా ఖర్చులు అధికంగా ఉండడంతో తడిసి మోపెడవుతోంది. దీంతో చాలామంది పార్ట్ టైమ్ జాబ్స్ (కొన్ని గంటల పని) చేయాల్సి వస్తోంది. అయితే ఆ పార్ట్ టైమ్ జాబ్స్ కూడా లభించడంలేదు. ఫలితంగా విద్యార్థుల డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలకు ఆయా పనికోసం వెళుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్.
అమెరికా దేశంలో కాలేజీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టింది. వారు క్యాంపస్ జాబ్స్ లభిస్తేనే ఉద్యోగం చేయాలి. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా క్యాంపస్ జాబ్స్ కరువయ్యాయి. దీంతో చాలామంది నియమాలకు విరుద్ధంగా చిన్నపాటి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తున్నారు. దీంతో వారికి ఖర్చులకు తగినంత సంపాదించుకుంటున్నారు. అయితే ఈ అవకాశాలు కూడా ఇప్పుడు సన్నగిల్లాయి.
Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు
అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా లాంటి దేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది కాలేజీ పూర్తయ్యాక హోటల్ లో వెయిటర్, ఫుడ్ డెలివరీ బాయ్, ట్యాక్సీ డ్రైవర్, లేదా ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ తమ ఖర్చుల కోసం తగినంత సంపాదించుకునేవారు. అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆర్థిక మాంద్యం కారణంగా చాలా కంపెనీలు మూతపడ్డాయి. దీంతో పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం.. చిన్న చితక ఉద్యోగాల కోసం లైన్ లో నిలబడుతున్నారు. ఈ కారణంగా పార్ట్ టైమ్ జాబ్స్ కాకుండా ఫుల్ టైమ్ కోసం వచ్చేవారికే ఉద్యోగం లభిస్తోంది.
ఈ క్రమంలో పార్ట్ టైమ్ జాబ్స్ పై ఆధారపడ్డ విదేశీ విద్యార్థులకు చేయడానికి పనిదొరకడం లేదు. ఇలాంటి తరుణంలో వారికి బేబీసిట్టర్ జాబ్స్ కొంతవరకు ఊరటనిస్తున్నాయి. బేబిసిట్టర్ అంటే పిల్లలకు ఆయా ఉద్యోగం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయడానికి లేదా ఇతరత్రా పనుల కోసం ఇంటి నుంచి బయటికి వెళితే.. ఆ సమయంలో పిల్లలను చూసుకునేందుకు ఇంట్లో బేబిసిట్టర్ అవసరం. పాశ్చాత్య దేశాల్లో బేబిసిట్టర్ చేసేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా ఈ పని అమ్మాయిలు ఎక్కువగా చేస్తున్నారు. బేబిసిట్టర్ ఉద్యోగమంటే భద్రత ఉంటుంది, పైగా ఇంట్లో పని అంటే పిల్లల తల్లిదండ్రులు తగినంత చెల్లిస్తున్నారు. దీనికి తోడు చాలామంది ఇంట్లోనే ఉండేందుకు ఒక గది, భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఈ సదుపాయాలు ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు బేబిసిట్టర్ జాబ్స్ చేస్తున్నార.
ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, ఇల్లినాయిస్ లో 20,000 మంది, ఒహయోలో 13,500 మంది, కనెక్టికట్ లో 7,000 మంది బేబిసిట్టర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో సగం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం.
అయితే క్యాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూ యార్క్, ఇల్లినాయిస్, లాంటి ప్రాంతాల్లో భారతీయులు ఎక్కవగా ఉండడం వల్ల ఈ ఉద్యోగం చేయడానికి ఎక్కువమంది ముందుకు వస్తున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల తక్కువ చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇండియన్ అమెరికన్స్ వద్ద పనిచేయడానికే ఇష్టపడుతున్నారు.
బేబిసిట్టింగ్ చేసే ప్రతీ విద్యార్థి గంటకు 13 డాలర్ల నుంచి 18 డాలర్ల వరకు సంపాదిస్తున్నారని సమాచారం. ఇల్లు, భోజన వసతులు ఇచ్చే వారు తక్కువగా చెల్లిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఒక అమ్మాయి ఒహాయో రాష్ట్రంలో చదువుకుంటోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేను ఒక ఇంట్లో 6 ఏళ్ల పిల్లాడిని చూసుకుంటూ ఉంటాను. రోజుకు 8 గంటల పని. ప్రతి గంటకు 13 డాలర్లు చెల్లిస్తున్నారు. పైగా సమయానికి భోజనం కూడా దొరుకుతోంది. బయట పెట్రోల్ పంప్ లో పనిచేసే కంటే ఇది చాలా బెటర్ ఉద్యోగం అని చెప్పింది.
కనెక్టికట్ లో చదువుకునే మరో తెలుగమ్మాయి (23) మాట్లాడుతూ.. “నేను రెండున్నరేళ్ల పాపను చూసుకోవాలి. వారాని ఆరు రోజులు పని. ప్రతి గంటకు 10 డాలర్లు ఇస్టున్నారు. ఆ ఆరు రోజులు నేను వారి ఇంట్లోనే ఉంటాను. ఆదివారం మాత్రం నా ఫ్రెండ్ రూమ్ లో గడుపుతాను. వచ్చే సంపాదన నా ఖర్చులకు సరిపోతోంది. నేను ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను.” అని తెలిపింది.