Iran Launches Missile Attack At Israel: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మెజ్ బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ రంగప్రవేశం చేసింది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ అధికారులు తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 400లకుపైగా క్షిపణులు ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్లు జరిపింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు యాక్టివ్ అయ్యాయి. ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు, క్షిపణులను దీటుగా ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించేందుకు ఐడీఎఫ్ అన్ని చర్యలు తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ ప్రజలకు అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇక, ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించిన అనంతరం ఇరాన్ స్పందించింది. చనిపోయిన హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్ బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్పోరూషన్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి తెలిపారు.
మరోవైపు టెల్ అవీవ్ లో ఉగ్రవాదులు రంగంలోకి దిగారు. ఓ మెట్రో స్టేషన్ లో జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆర్మీ బృందం అప్రమత్తం కావడంతో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీవ్ లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ సమయంలో ఎవరూ కూడా బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.