People Leave New Zealand in Huge Numbers as economy Bites: అందమైన దీవులకు అడ్డాగా ఉన్న న్యూజిలాండ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందా..? న్యూజిలాండ్ నుండి విదేశీయులంతా వెనక్కి వచ్చేస్తున్నారా..? పరిస్థితులన్నీ అవుననే అంటున్నాయి. న్యూజిలాండ్ కుప్పకూలుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల, జింబాబ్వే, శ్రీలంక, కొన్ని ఇతర దేశాల్లా న్యూజిలాండ్ కూడా పతనం అంచున ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంతకీ, న్యూజిలాండ్‌లో ఎందుకీ పరిస్థితి వచ్చింది? లెట్స్ ఫోకస్.
రికార్డు సంఖ్యలో న్యూజిలాండ్‌ను విడిచివెళుతున్న ప్రజలు
ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న కెరీర్‌లకు అగ్ర గమ్యస్థానంగా ఉన్న న్యూజిలాండ్.. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న సమస్యలను తట్టుకోలేక అక్కడి వలసదారులతో పాటు చాలా మంది స్థానికులు కూడా ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. నిరుద్యోగం పెరగడం, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం, ఆర్థిక వృద్ధి బలహీన పడిన కారణంగా ప్రజలు రికార్డు సంఖ్యలో న్యూజిలాండ్‌ను విడిచిపెడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కోడానికి క్యూలు కడుతున్నారు. ఈ వలసలు తాత్కాలిక ఉద్యోగులకే పరిమితం కాలేదు. న్యూజిలాండ్ పౌరులు కూడా ఆస్ట్రేలియాకు వలస వెళ్ళే ఆలోచనతో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అర్హులైన ప్రత్యేక కేటగిరీ వీసాతో ఆస్ట్రేలియాలో ఉద్యోగంతో పాటు పర్మనెంట్‌గా నివసించడానికి కూడా కొందరు ప్రయత్నిస్తున్నారు. అక్కడ నివశిస్తున్న భారతీయులతో పాటు, కొందరు స్థానికులు కూడా హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి భారతీయ నగరాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మూడింట ఒక వంతు మంది ఆస్ట్రేలియాకు
ఆగస్ట్ నెలలో న్యూజిలాండ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లక్షా 31 వేల 200 మంది న్యూజిలాండ్‌ను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో 80 వేల 200 మంది న్యూజిలాండ్ పౌరులు. ఒక సంవత్సర కాలంలో ఇంత అత్యధికంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన దాఖలాలు ఇంత ముందు ఎప్పుడూ నమోదు కాలేదు. 2019 జూన్‌తో పోలిస్తే దేశాన్ని వదిలి వెళుతున్నవారి సంఖ్య దాదాపు 70% అధికంగా ఉంది. అయితే, వీరిలో మూడింట ఒక వంతు మంది ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు డేటా చెబుతోంది. నికర వలసలు, దేశాన్ని వదిలి వెళ్లిపోతున్న వారి సంఖ్య అధిక స్థాయిలో ఉండటంతో పాటు.. అక్కడి ఆర్థిక వ్యవస్థ కారణంగా న్యూజిలాండ్‌కు వెళ్లాలనుకునే విదేశీ పౌరుల సంఖ్య కూడా తగ్గుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, అప్పటి ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నిర్వహణలో మెరుగైన ఫలితాలు చూపించింది. దీనితో, విదేశాల్లో నివసిస్తున్న న్యూజిలాండ్ వాసులు అత్యధిక సంఖ్యలో స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే, ఇందులో 5.3 మిలియన్ల మంది తిరిగి దేశం విడిచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. పెరుగుతున్న జీవన వ్యయం, అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఉద్యోగావకాశాల కారణంగా న్యూజిలాండ్ వాసులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
Also Read: తనను తానే పెళ్లి చేసుకున్న తుర్కిష్ ఇన్ఫ్లు యెన్సర్ ఆత్మహత్య
ఆస్ట్రేలియాలో పని చేయడానికి ‘స్పెషల్ కేటగిరీ వీసాలు’
1999లో అధికారిక నగదు రేటును ప్రవేశపెట్టినప్పటి నుండి న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ నగదు రేట్లను 521 బేసిస్ పాయింట్లకు పెంచింది. ఈ పరిణామం తర్వాత, న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోయింది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధి 0.2% ఉండగా.. రెండవ త్రైమాసికంలో నిరుద్యోగం 4.7%కి పెరిగింది. ద్రవ్యోల్బణం 3.3% తో అధికంగా నమోదయ్యింది. అదే సమయంలో, న్యూజిలాండ్ ప్రభుత్వం, దేశంలోని పబ్లిక్ సర్వీస్ సేవలను గణనీయంగా తగ్గించింది. దీనితో, చాలా మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు ఎసరొచ్చింది. మరోవైపు, ఆస్ట్రేలియాలో ఉద్యోగావకాశాలు న్యూజిలాండ్ ప్రజలను ఊరించాయి. నర్సింగ్, పోలీసింగ్, టీచింగ్ వంటి రంగాలలో అవకాశాలను కల్పిస్తున్న ఆస్ట్రేలియా, పునరావాస ప్యాకేజీలను కూడా అందిస్తోంది. ఆస్ట్రేలియాలో ఎక్కడ నైపుణ్య కొరత ఉందో.. వాటికి న్యూజిలాండ్ వాసులను ఆకర్షిస్తోంది. అందులోనూ, న్యూజిలాండ్ వాసులు ఆస్ట్రేలియాలో పని చేయడానికి ప్రత్యేకంగా వీసాలు కూడా అవసరం లేదు. దీనితో, చాలా మంది ఆస్ట్రేలియా బాటపడుతున్నారు. ఇలా వెళుతున్న వారిలో ఎక్కువ మంది 20 నుండి 30 ఏళ్ల వయసున్న యువత కాగా.. వీరిలో 25 నుండి 29 మధ్య వయసున్న యువకులు ఎక్కవగా ఉన్నారు.
న్యూజిలాండ్ విడిచి వెళ్లిన వారిలో 0.6% భారతీయులు
అధికారిక గణాంకాల ప్రకారం, ఇటీవలి కార్పొరేట్ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగించడం ఎక్కువయ్యింది. అలాగే, చాలా మంది వారి వ్యాపారాలను మూసివేస్తున్నారు. దీని కారణంగా, 2024 జనవరి-జూన్ మధ్య దేశ జనాభాలో 1.5% మంది వెళ్లిపోగా అందులో 0.6% భారతీయులు ఉన్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసాలున్న వారు కూడా అక్కడి పరిస్థితులకు భయపడి తిరిగి భారతదేశానికి వచ్చేస్తున్నారు. రెండు, మూడు దశాబ్ధాల క్రితం వెళ్లి అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నవారి వ్యాపారాలు సరిగ్గా నడవక, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటూ స్వదేశ బాట పడుతున్నారు. అక్కడ నుండి బయటకు వచ్చిన వారిని అడిగితే, ‘మునిగిపోయే నావలో ఎన్నాళ్లు ప్రయాణం చేస్తామనే’ సమాధానమే చెబుతున్నారు. కొంతమంది భారతీయ వలసదారులు ఇప్పటికీ న్యూజిలాండ్‌లో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నప్పటికీ.. వాళ్లు కూడా చాలా కాలం పాటు అక్కడ ఉండలేమనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ తిరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడితే తప్ప మిగిలిన వారు అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు.
జీతంతో పోల్చితే అద్దెలు, తనఖాలు ఎక్కువ
కోర్‌లాజిక్ సంస్థ డేటా ప్రకారం, న్యూజిలాండ్‌లో నివాస గృహాల అద్దె కూడా చాలా పెరిగింది. జీతంతో పోల్చితే అద్దెలు, తనఖాలు భారీగా పెరిగాయి. గృహ నిర్వహణ ఖర్చులు దీర్ఘకాలిక సగటు కంటే అధ్వాన్నంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి తోడు, జీతాలు పెరగడం మాట అటుంచితే… ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల, గత మూడేళ్లలో మోర్టగేజ్ చెల్లింపులకు అవసరమైన ఆదాయం వాటా 53% – 57% మధ్య మాత్రమే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, 2007-2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో… మోర్టగేజ్ చెల్లింపులు ఆరు త్రైమాసికాల్లో 50%, అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని మాత్రమే చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యూజిలాండ్ వాసులకు ఆస్ట్రేలియా ఆహ్వానం పలికింది. ఈ మధ్య కాలంలో, న్యూజిలాండ్ హెరాల్డ్ ఎడిషన్‌లో ఫుల్-పేజీ ఉద్యోగ ప్రకటనలు పెరిగాయి. ఇక, ఆక్లాండ్ కంటే సిడ్నీలో 60% ఎక్కువ జీతాలు రావడంతో ప్రజలంతా అటు పరుగెడుతున్నారు.