Britain in Crisis Soon : రాజకీయ సంక్షోభమే కాదు… ఆర్థిక సంక్షోభం కూడా బ్రిటన్ ను కలవరపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ప్రభావం పడిన దేశాల్లో ఒకటైన బ్రిటన్ లో… ద్రవ్యోల్బణం అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే… అత్యంత క్రూరస్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని అక్కడి జనం గగ్గోలు పెడుతున్నారు. కరెంటు బిల్లు ఏకంగా మూడు రెట్లు పెరిగిందని, గోధుమల ధర 30 శాతానికిపైగా ఎగసిందని వాపోతున్నారు… అక్కడి సంస్థల యజమానులు, ప్రజలు. దీని వల్ల బ్రెడ్ ధర భారీగా పెరిగిందని… రొట్టెల ధరపై దేశంలో విప్లవం కూడా మొదలైందని భావించాల్సి వస్తుందని అంటున్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా బ్రిటన్ లో ఇంధన ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ధాన్యాలు, నూనెగింజలు, ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో… ఆహార పదార్థాలు, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది ఇక్కడితో ఆగదని… రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉంటాయని అక్కడి ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే బ్రిటన్ లో ఆహార పదార్ధాల ధరలు ఇప్పటికే దాదాపు 20 శాతం పెరిగాయని తాజాగా విడుదలైన గణాంకాల్ని పరిశీలిస్తే అర్థమవుతోంది.
లేటెస్ట్ డేటా ప్రకారం బ్రిటన్ లో ఒక్క సెప్టెంబర్ లోనే నిత్యావసరాలు 10 శాతాం పెరగ్గా, ఆహార పదార్ధాల ధరలు 14 శాతానికి పైగా పెరిగాయి. చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు వీపరీతంగా పెరిగిపోతుండటంతో… బ్రిటన్ లోనూ శ్రీలంక తరహా పరిస్థితులు చూడాల్సి వస్తుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.