Train Tickets on EMI : రైళ్లలో తరచూ ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. టికెట్ బుక్ చేసుకునే సమయంలో చార్జి మొత్తం ఒకేసారి చెల్లించకుండా… నెల నెలా ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తోంది… IRCTC. CASHe అనే సంస్థతో కలిసి ప్రయాణికులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఒకరిద్దరి టికెట్లకు, దగ్గరి ప్రయాణాలకు ఈఎంఐలో టికెట్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం చాలా మందికి లేకపోయినా… దూర ప్రయాణాలు, అది కూడా ఎక్కువ మంది ప్రయాణించాల్సి వచ్చినప్పుడు… టికెట్లను ఈఎంఐలో బుక్ చేసుకునే వెసులుబాటు ఉండటం… చాలా మందికి ఆర్థికంగా భారం కాకుండా ఉండే అవకాశం ఉంది.
సాధారణంగా ఆన్ లైన్ లో ఏదైనా వస్తువును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి కొనేముందు… వాటికి ఈఎంఐ ఆప్షన్ కూడా చూపిస్తాయి… సదరు సంస్థలు. సరిగ్గా అలాంటి సదుపాయాన్నే ట్రావెల్ నౌ, పే లేటర్ – TNPL పేరుతో అందుబాటులోకి తెచ్చింది… ITCTC. IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో టికెట్లు బుక్ చేసి పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వచ్చాక… అక్కడ ఈఎంఐ ఆప్షన్ కనిపిస్తుంది. చార్జి మొత్తాన్ని 6 లేదా 8 నెలల వాయిదాల్లో చెల్లించేలా ఆప్షన్ ఉంటుంది. అందులో ప్రయాణికులు వాళ్లకి ఇష్టం వచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
జనరల్ తో పాటు తత్కాల్ టికెట్ల బుకింగ్ కి కూడా ఈఎంఐ ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. కాస్త డౌన్ పేమెంట్ కట్టి మిగతా మొత్తాన్ని ఈఎంఐల్లోకి మార్చుకునే సదుపాయంతో పాటు… అసలేమీ చెల్లించకుండానే చార్జి మొత్తాన్ని కూడా ఈఎంఐలోకి మార్చుకునే సదుపాయం ఉంది. ప్రయాణికులు ఎంచుకునే కాలవ్యవధిని బట్టి వడ్డీ వసూలు చేస్తుంది… CASHe సంస్థ. టికెట్లను ఈఎంఐలోకి మార్చుకోడానికి ఎలాంటి డాక్యుమెంటేషన్ కూడా అవసరం ఉండదు. IRCTC రైల్ కనెక్ట్ యాప్ వాడే వాళ్లందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. చార్జి మొత్తం కట్టి టికెట్ బుక్ చేసుకోవాలా? లేక ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలా? అనేది పూర్తిగా ప్రయాణికుల ఇష్టం.