
Israel-Hamas War : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మానవత్వం దృష్ట్యా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తక్షణ సంధికి పిలుపునిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై భారత దేశం ఓటు వేయలేదు. ఈ తీర్మానంలో హమాస్ ప్రస్తావన లేదని కారణం చూపుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది.
“ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని మరియు దౌత్య చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము” అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో మానవతా సంక్షోభం ఏర్పడినందున ఏ అవరోధం లేకుండా అక్కడ తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఐక్యరాజ్య సమితి సంధి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై హమాస్ జరిపిన ఆకస్మిక దాడిలో 1,400 మంది మరణించారు. అయితే ఈ దాడులను ఖండిస్తూ, తీర్మానం నుంచి “హమాస్” అనే పదాన్ని విస్మరించడాన్ని భారత్ సూచిస్తూ.. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందని యోజనా పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
“అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడులు దిగ్భ్రాంతిని కలిగించాయి. వాటిని అందరూ ఖండించాలి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి గురించి ఆందోళన చెందుతున్నాము. వారిని తక్షణమే షరతులు లేకుండా విడుదల చేయాలి. ఉగ్రవాదం ఒక కాన్సర్ లాంటిది.. దానికి సరిహద్దులు, జాతితో సంబంధం ఉండదు. ఉగ్రవాద చర్యలు ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ప్రపంచ దేశాలు ఉగ్రవాదుల పట్ల ఎలాంటి సానుభూతి చూపకూడదు. అలాగే యుద్ధం వల్ల అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నందుకు ఆందోళన చెందుతున్నాము” అని యోజనా పటేల్ చెప్పారు.
“చర్చల ద్వారా ఇజ్రాయెల్-పాలస్తీనాల సమస్యల పరిష్కారానికి” భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్ సమర్పించిన ఈ ముసాయిదా తీర్మానంపై 120 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. 14 దేశాలు వ్యతిరేకంగా, 45 దేశాలు ఓటు వేయలేదు. ఎక్కువ ఓట్లు అనుకూలంగా రావడంతో ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది.
భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్ మరియు యుకె దేశాలు ఈ తీర్మానంపై ఓటు వేయలేదు.