
Medigadda : మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై నిపుణుల కమిటీ నివేదిక కేంద్రానికి ఇంకా అందలేదు. ఇప్పటికే బ్యారేజ్‌ను అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల బృందం పరిశీలించింది. అయితే కేంద్రానికి నివేదిక అందించడంలో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమని తెలుస్తోంది. బ్యారేజ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 20 నివేదికలను కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 నివేదికలను మాత్రమే అందించింది. మరో నివేదికను పాక్షికంగా అందించారు. అయితే నిపుణుల కమిటీ కోరినా ప్రభుత్వం నివేదికలు ఎందుకివ్వడం లేదు? నిర్మాణంలో జరిగిన లోపాలు బయటపడతాయని భయపడుతున్నారా? లేక డిజైన్లలో జరిగిన అవకతవకలు బయటపడతాయని భయమా? ఎన్నికల సమయంలో అసలు విషయాలు బయటపడకూడదని భావిస్తున్నారా? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
అయితే ఈ నివేదికలను అందించేందుకు ఆదివారం (అక్టోబర్ 29) వరకు డెడ్‌లైన్ విధించింది నిపుణుల కమిటీ. ఆలోగా నివేదికలను ఇవ్వకపోతే.. తర్వాత నివేదికలను లేనట్టుగా భావించి..తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. మరి రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలను అందిస్తుందా? లేదా? ఒకవేళ అందించకపోతే కేంద్ర తీసుకునే చర్యలేంటి? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
కాగా..మేడిగడ్డ బ్యారేజీలో మరో ఐదారు పియర్స్ కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటిపారుదలశాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కట్ ఆఫ్ వాల్స్ పరిస్థితిపై అధయనం చేయనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటు ఒక్క బ్లాకుకే పరిమితమైందా ? ఆ ఎఫెక్ట్ మిగతా బ్లాకులపై కూడా ఉంటుందా అనే దానిపై కూడా అధ్యయనం చేస్తారు.
.
.