Japan Airlines : ఇటీవల అనేక దేశాల ఎయిర్ లైన్స్ టార్గెట్ గా సైబర్ దాడులు జరుగుతున్నాయి. అందులో.. జపాన్ ఎయిర్ లైన్స్ సైతం చిక్కుకుంది. దీంతో.. ఆ దేశ ఎయిర్ సర్వీసులు మొత్తాన్ని నిలిపివేసిన జపాన్.. అత్యవసరంగా స్పందించాల్సి వచ్చింది. దాదాపు గంట పాటు దేశంలోని అన్ని విమాన సేవలు నిలిచిపోగా.. 14 దేశీయ సర్వీసులు, మరికొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడినట్లు టోక్యో వెల్లడించింది.
జపాన్ విమాన సర్వీసుల్లో ఉదయం 7.25 గంటలకు సమస్య ఏర్పడినట్లు అధికారులు తొలుత గుర్తించారు. దాంతో.. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ విక్రయాల్ని పూర్తిగా నిలిపివేశారు. కాగా.. అప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్న వారి టికెట్లు రద్దు కావని.. వాటి సర్వీసుల్ని తర్వాత కొనసాగిస్తామని సంబంధిత ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
సైబర్ అటాక్ జరిగినట్లు గుర్తించిన జపాన్ ఎయిర్ లైన్స్ వెంటనే ప్రతిస్పందించింది. వారి సేవల్లోకి మరింత జోరబడకుండా నిరోధించడంతో పాటు సైబర్ దాడి జరిగిన సోర్స్ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తుట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడినట్లు వెల్లడించింది. కానీ.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది.
మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్, జపాన్ ఎయిర్ లైన్స్ తో కలిసి విచారణ ప్రారంభించింది. ఈ దాడులకు కారణాలు కనుక్కోవడంతో పాటు ఎక్కడి నుంచి దాడులు జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ షేర్ చేసిన జపాన్ ఎయిర్ లైన్స్.. తాము సమస్యకు కారణాన్ని గుర్తించామని దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తాము సిస్టమ్ రికవరీకి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అప్పటి వరకు దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల టికెట్ల విక్రయాల్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందులకు క్షమాపణలు తెలిపింది.
కానీ.. కొద్దిసేపటికే మరో పోస్టులో జపాన్ ఎయిర్ లైన్స్ సిస్టమ్స్ పూర్తిగా డౌన్ అయిపోయినట్లు ప్రకటించింది. అందుకు కారణాలపై దర్యాప్తు సాగుతుందని తెలిపింది. ప్రస్తుత సైబర్ అటాక్ కారణంగా.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అంగీకరించిన జపాన్ ఎయిర్ లైన్స్.. వీలైనంత త్వరగా తిరిగి సర్వీసుల్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాలోనూ నిలిచిపోయిన విమాన సర్వీసులు
క్రిస్మస్ సందర్భంగా భారీగా విమాన ప్రయాణాలు పెరిగిపోయిన రద్దీ సమయంలో అమెరికాలోనూ విమాన సేవల్లో ఆంటకం ఏర్పడింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన అనేక విమానాలు దాదాపు గంట సేపు నిలిచిపోయాయి. ఇలా ఆగిపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని అమెరికన్ ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. కానీ..సమస్య గురించి తెలపలేదు.
Also Read : 2025లో పొంచి ఉన్న అతిపెద్ద మహమ్మారి.. పక్షులు, పాడి పశువు, మనుషుల్లో వేగంగా వ్యాప్తి
న్యూయార్క్, డాలస్ ఫోర్ట్ వర్త్, షాలెట్ ఎయిర్ పోర్టులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సాంకేతిక ఇబ్బందుల కారణంగా.. దేశంలోని దాదాపు 1,447 విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు తెలుపగా.. ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పండుగ సమయంలో ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి ఇలాంటి ఘటనలు ఎదురుకావడం సరైంది కాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. గంట తర్వాత విమాన సర్వీసుల్ని తిరిగి పునరుద్ధరించారు.