Jimmy Carter.. the 99 yearold former US president is eager to vote for Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కమలాహ్యారిస్, ట్రంప్ మధ్య వ్యూహాత్మక ప్రచారం ఊపందుకుంది. ఎప్పటికప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతుంటాయి. మొన్నటిదాకా ట్రంప్ కు జై కొట్టిన నేతలే ఇప్పుడు కమలా హ్యారిస్ కు మద్దతు తెలుపుతున్నారు. జోబిడెన్ ఎన్నికల బరినుండి తప్పుకోవడంతో కమలా హ్యారిస్ ను పార్టీ హై కమాండ్ బరిలో దింపారు. కమలా హ్యారిస్ కు పార్టీ పెద్దల మద్దతుతో సహా ఆశీర్వచన అభినందనలు కూడా అందుతున్నాయి. డెమెక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మద్దతు కమలా హ్యారిస్ కు లభించింది. 1977 నుంచి జనవరి 1981 దాకా అమెరికా అధ్యక్షుడిగా చేసిన జిమ్మీ కార్టర్ కు ప్రస్తుతం 99 సంవత్సరాలు. మరో రెండు నెలలలో వంద సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్నారు.
జిమ్మీ కార్టర్ సపోర్ట్
రాబోయే ఎన్నికల కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని..కమలా హ్యారిస్ ని తాను వ్యక్తిగతంగా అభిమానిస్తానని..తన మద్దతు కమలాకు ఎప్పటికీ ఉంటుందని ..ముఖ్యంగా కమలా హ్యారిస్ ప్రసంగాలకు తాను వీరాభిమానిని..ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల డీఎన్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలా హ్యారిస్ ను అధ్యక్ష అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి మాజీ అమెరికా అభ్యక్షులు ఒబామా,జో బిడెన్ లు కూడా పాల్గొని కమలా హ్యారిస్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. డెమెక్రాటిక్ పార్టీని దాని సిద్ధాంతాలను ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేయాలని..కమలా హ్యారిస్ సామర్థ్యంపై తమకు నమ్మకం ఉందని మాజీ అమెరికా అధ్యక్షులు తెలియజేశారు. అయితే జిమ్మి కార్టర్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని సందేశం పంపారు.. కాగా ఆయన తరపున ఆయన మనవడు జాసన్ కార్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాత సందేశం
తన తాత సందేశాన్ని అక్కడ ఉన్న వారందరికి తెలియజేయడమే కాకుండా తాను కూడా కమలా హ్యారిస్ గురించి ప్రసంగించారు. కమలా హ్యారిస్ మంచి వక్త అని ఆమెకు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసని అన్నారు. డెమోక్రాటిక్ పార్టీని ముందుకు నడపగల సామర్థ్యం ఆమెకు పుష్కలంగా ఉందని అన్నారు. అలాగే తాత జిమ్మీ కార్టర్ తన మద్దతు కమలా హ్యారిస్ కి తెలిపారని..ఆయన తన బలమైన సందేశం పంపారని..కమలా హ్యారిస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని జాసన్ కార్టర్ తెలిపారు.