Kuwait: ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా ఆంక్షల కొరడా ఝలిపించింది కువైట్. తమ చట్టాలను పదును పెట్టింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం వాటిని కువైట్ నిషేధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కువైట్ వార్తాపత్రిక అల్ ఖబాస్ ప్రకారం.. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించింది ఆ దేశం. లైవ్ ప్రసారాలపైనా నిషేదం విధించింది. కువైట్ సివిల్ ఏవియేషన్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సాద్ అల్ ఉతైబీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధం ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న ఉద్యోగులు, వివిధ సంస్థల సిబ్బందికి వర్తిస్తుందని అందులో స్పష్టంగా తెలిపారు.
మొబైల్ ఫోన్లు, కెమెరాలతో వీడియోలు తీయడం, రికార్డు చేయడం, లైవ్ ప్రసారాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. రన్‌వేలు, ప్రయాణికుల టెర్మినళ్లు, పరిపాలనా భవనాలు, సాంకేతిక విభాగాలు సహా అన్ని ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చారు. విమానాశ్రయానికి సంబంధించి అంతర్గత పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, భద్రతా విధానాలు, భద్రతా వ్యవస్థలు, తనిఖీ కేంద్రాలు, నిఘా కెమెరాలకు సంబంధించిన సమాచారాన్ని ఫోటో తీయడం లేదా ప్రచురించడాన్ని నిషేధిస్తుంది.
ALSO READ: మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, వందల కోట్ల నష్టం కూడా
ఒకవేళ నిబంధనలను ఎవరైనా ఉల్లఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కొద్ద ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయం, దాని అనుబంధ సౌకర్యాలు సున్నితమైన అంశాలని, కీలకమైన మౌలిక సదుపాయాలు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సర్క్యులర్‌లోని ఆర్టికల్ 2 ప్రకారం.. ఉల్లంఘన జరిగితే కువైట్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని తేల్చేశారు.