అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. నిజానికి ట్రంప్ ఊహించలేదు ఏమో కానీ.. ప్రపంచం మొత్తం ఆయనకు షాక్ తగులుతుందని.. తగిలి తీరాలని అనుకున్నారనుకోండి. ఎన్నికల బరిలో నిలబడకపోయినా.. ఈ ఎన్నికల ప్రచారాన్ని తన చుట్టూనే తిప్పుకున్న ట్రంప్‌కు అమెరికా ఓటర్లు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అమెరికా పార్లమెంటులోని రెండు కీలక సభలపైనా రిపబ్లికన్ల పట్టు జారిపోయింది. ఎగువసభ అయిన సెనెట్‌లో డెమోక్రాట్లకు ఆధిపత్యం దక్కింది. దిగువసభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోనూ డెమోక్రాట్లు మెజారిటీ సాధించేసినట్టే. అంటే అధ్యక్షుడు ట్రంప్ చేతిలో వైట్‌హౌస్ ఉంటే.. ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఇప్పుడు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిందన్నమాట. మరి అసలు ట్రంప్ ఎందుకు ఓడిపోయారు? అమెరికా ప్రజలకు ఆయనపై ఎందుకు విసుగు వచ్చింది? ఇప్పుడు ఈ ఓటమిని ట్రంప్ ఎలా కవర్ చేసుకుంటారు? ఈ ఓటమి కారణంగా వచ్చే రెండేళ్లలో ఆయనకు ఎదురయ్యే సమస్యలేంటి?
అమెరికా కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. ఒకటి సెనెట్.. మరొకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సెనెట్‌లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో 435 స్థానాలుంటాయి. ప్రతి రెండేళ్లకు జరిగే మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌లో ఈ రెండు సభల్లోనూ ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లోనే రిపబ్లికన్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌కు బలమైన మద్దతున్న సౌత్ కరోలినాలో 1998 తర్వాత తొలిసారి డెమోక్రటిక్ పార్టీ సెనెట్ సీటును గెలుచుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి డార్లిన్ గ్రాహంపై డెమోక్రటిక్ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్ విజయం సాధించారు. టెక్సాస్‌లోనూ ఇదే పరిస్థితి. దశాబ్దాలుగా రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో విజయం సాధించడం ఒక సంచలనం అనే చెప్పాలి. ఒహాయో, కాన్సాస్, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు విజయ ఢంకా మోగించారు. సింపుల్‌గా చెప్పాలంటే సెనెట్‌పై డెమోక్రాట్లకు పట్టు లభించింది. ఇది సాధారణ ఎన్నికల ఫలితాలు కాదు. ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలానికి వచ్చిన ఓ వార్నింగ్ బెల్.
ఇప్పుడు అసలు ప్రశ్న.. ట్రంప్ ఎందుకు ఓడిపోయారు? దీనికి మొదటి కారణం.. ఆర్థిక పరిస్థితి. అమెరికా ప్రజలకు రాజకీయాల కంటే ముందు కనిపించేది తమ జేబులో మిగిలే డబ్బు. గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ బిల్లులు, మెడికల్ ఎక్స్‌పెన్సివ్స్.. ఇలా నిత్యావసరాల ధరలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని, అమెరికన్లకు మంచి రోజులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మెక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్‌తో వచ్చి అధ్యక్ష పీఠంలో కూర్చున్నారు. ప్రపంచం మొత్తం అమెరికా పవర్ ఏంటో చూపించే ప్రయత్నంలో ఉన్న ట్రంప్.. అమెరికన్ల గురించి మర్చిపోయినట్టు కనిపించింది. ట్రంప్ చెప్పుకుంటున్న విక్టరీల కంటే.. ప్రజలు తమ నెలవారీ ఖర్చులనే ఎక్కువగా లెక్కలోకి తీసుకున్నారు.
ట్రంప్ ఇరాన్‌పై చేపట్టిన మిలటరీ ఆపరేషన్ అమెరికాలో పెద్ద హాట్ డిబెట్. ఈ యుద్ధం పుణ్యమా అని అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికాకు నష్టం తప్ప లాభం లేదు అనేది అక్కడ మెజారిటీ ప్రజల మాట. 55 శాతం మంది అమెరికన్లు ఇదే ఒపినియన్‌తో ఉన్నారనేది సర్వేలు చెబుతున్నాయి. అంటే.. అమెరికా భద్రత పేరుతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు.. చివరకు అమెరికన్ల జేబులకే చిల్లు పెడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి.
మూడో కారణం.. మరేవరో కాదు ట్రంపే. ట్రంప్ తన పాలనలో డెసిషన్స్ అన్నీ చాలా స్పీడ్‌గా తీసుకుంటున్నారనే పేరున్నప్పటికీ.. ప్రతిపక్షాలపై దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన తీరు వంటి అంశాలు ప్రజలను కాస్త కంగారు పెట్టాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కొంతమంది రిపబ్లికన్ ఓటర్లు కూడా ట్రంప్‌ను లైట్ తీసుకున్నారని సర్వేలు చెబుతున్నాయి.
ట్రంప్ తీరుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రియాక్ట్ అయిన విధానం. తన పేరు బ్యాలెట్ పేపర్‌పై ఉండి ఉంటే రిపబ్లికన్లు అఖండ విజయం సాధించేవారంటూ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. అంటే.. పార్టీ ఓడిపోయిందని కాదు.. తాను పోటీలో లేకపోవడం వల్లే ఈ ఓటమి అనే స్టైల్‌లో మాట్లాడుతున్నారు ట్రంప్. సో.. ఈ ఓటమికి తాను కారణం కాదు.. రిపబ్లిక్ పార్టీ క్యాండిడేట్స్ వల్లే ఈ ఓటమిని అని డైవర్ట్ చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎట్ ది సేమ్ టైమ్.. డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానని కూడా అనౌన్స్ చేసేశారు. ఈ అనౌన్స్‌మెంట్ వెనక కూడా ఒక రీజన్ ఉంది. ట్రంప్ టర్మ్ ఇంకా రెండేళ్లు ఉంది. ఇప్పుడు డెమోక్రాట్లను టార్గెట్ చేసి.. విమర్శలు చేస్తే.. ఆ రెండేళ్ల పాలనలో వాళ్లు ముప్పు తిప్పలు పెట్టే చాన్స్ ఉంది. సో.. కష్టమైనా.. నష్టమైనా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి. సో.. ఈ ఓటమిని డౌన్ గ్రేడ్ చేస్తూ.. రాజీ చేసుకోవడానికి రెడీగా ఉన్నానంటున్నారు ట్రంప్.
అమెరికాలో అసలు గేమ్ ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి చాలా అధికారాలున్నప్పటికీ.. దేశాన్ని నడపడానికి కాంగ్రెస్ సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే చట్టాలు ఆమోదించాల్సింది కాంగ్రెస్‌లోనే. ట్రంప్ తీసుకురావాలనుకునే కొత్త చట్టాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, పన్నుల మార్పులు, ఖర్చులకు సంబంధించిన నిర్ణయాలకు కాంగ్రెస్ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు రెండు సభల్లోనూ డెమోక్రాట్ల హవా ఉండటంతో.. ట్రంప్‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే చాన్స్ ఉంది.
డెమోక్రాట్లకు కాంగ్రెస్ కమిటీలపై ఇప్పుడు పట్టు లభించింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఖర్చులు, విదేశాంగ విధానం, పరిపాలనలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. ఇలా అనేక అంశాలపై అధికారులు, మంత్రులను ప్రశ్నించవచ్చు. అవసరమైతే సబ్‌పీనాలు ఇష్యూ చేసి విచారణలకు పిలవొచ్చు. అంటే ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చిన రిపబ్లికన్ల స్థానంలో.. వాటిని ప్రశ్నించే డెమోక్రాట్లు కీలక స్థానాల్లోకి వస్తారు. అంతేకాదు ట్రంప్ బడ్జెట్, ప్రభుత్వ కార్యకలాపాలపై కూడా ఫుల్ ఫోకస్ ఉంటుంది. ప్రభుత్వానికి నిధులు కేటాయించే విషయంలో కాంగ్రెస్ కీలకం. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే బడ్జెట్ ఆమోదం ఆలస్యం కావచ్చు. పరిస్థితులు తీవ్రంగా మారితే ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి కూడా రావచ్చు.
అక్కడితో అయిపోలేదు.. ట్రంప్ చేసే నియామకాలు, విధానాలపై కూడా ప్రశ్నలు మొదలవుతాయి. సెనెట్‌కు ఫెడరల్ అధికారుల నియామకాలు, న్యాయమూర్తుల నియామకాలు వంటి కీలక అంశాల్లో అధికారం ఉంటుంది. అక్కడ డెమోక్రాట్లకు మెజారిటీ రావడంతో ట్రంప్ కోరుకున్నవారిని అపాయింట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే ట్రంప్ పని అయిపోయినట్టేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన దగ్గర మరో బలమైన ఆయుధం ఉంది. అదే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అధ్యక్షుడిగా తన పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించి కొన్ని విధానాలను అమలు చేయవచ్చు. ఇప్పటికే ట్రంప్ తన రెండో పదవీకాలంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, టారిఫ్‌లు, అత్యవసర అధికారాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్‌లో చట్టాలు ఆమోదం పొందకపోయినా.. తనకున్న కార్యనిర్వాహక అధికారాలతో కొన్ని నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లగలరు. కానీ అన్నిసార్లు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగ పరిధిని దాటితే కోర్టులు వాటిని అడ్డుకోవచ్చు. నిధులు అవసరమైన కార్యక్రమాలకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరిగా కావాలి. సో.. అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదు.
ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం.. లేమ్ డక్ సెషన్. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ జనవరి 2027లో బాధ్యతలు చేపట్టే వరకు.. ప్రస్తుత కాంగ్రెస్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవడానికి రిపబ్లికన్లకు ఒక చివరి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు ప్రయత్నించవచ్చు. అంటే అధికారం చేతులు మారకముందే తమకు అనుకూలమైన నిర్ణయాలను రిపబ్లికన్లు తీసుకునే చాన్స్ ఉంది.
Also Read: ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?
మొత్తంగా చూస్తే.. ఈ మిడ్‌టర్మ్ ఎన్నికలు ట్రంప్ అధ్యక్ష పదవిని వెంటనే ప్రమాదంలో పడేయవు. ఆయన 2028 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. కానీ ఆయన పాలన సాగించే విధానం మాత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల సపోర్ట్‌తో వేగంగా నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. ఇకపై ప్రతి కీలక నిర్ణయానికి డెమోక్రాట్లకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కొత్త చట్టాలు చేయడం కష్టమే.. విచారణలు ఎదుర్కోనే చాన్స్ ఉంది.. అంతేకాదు నెక్ట్స్ అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ట్రంప్ చేసిన తప్పులను ప్రజల ముందు ఉంచుతారు. ఇప్పటివరకు అమెరికా రాజకీయాలను ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి అమెరికా ఓటర్లు అలా కుదరదని తేల్చేశారు. మరి వచ్చే రెండేళ్లు ట్రంప్ తన విధానాలను ముందుకు తీసుకెళ్తారా? లేక డెమోక్రాట్ల పొలిటికల్ ట్రాప్‌లో పడతారా? మొత్తానికైతే అమెరికా పాలిటిక్స్ ముందు ముందు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.