E-Paper
Advertisement

అగ్రరాజ్యంలో మారిన లెక్క.. ఇండియాపై ఇంపాక్ట్ ఏంటి?

అగ్రరాజ్యంలో మారిన లెక్క.. ఇండియాపై ఇంపాక్ట్ ఏంటి?
Advertisement

అమెరికాలో ఎన్నికలు జరిగాయి.. ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. డెమొక్రాట్లు రెండు సభలపైనా పట్టు సాధించారు. అయితే ఈ ఫలితాలు కేవలం అమెరికా రాజకీయాలనే కాదు.. భారత్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలను కూడా ప్రభావితం చేయబోతున్నాయి. అసలు అమెరికాలో ఏం జరిగింది? ట్రంప్ అధికారాలకు ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాబోతున్నాయి? దీనివల్ల భారత్‌కు లాభమా? నష్టమా? తెలుసుకుందాం.

2029 వరకు ట్రంప్ పాలన

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ 2029 జనవరి వరకు పదవీలోనే ఉంటారు. కానీ, ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టు ఆయన పాలన ఉండబోతుంది. ఎందుకంటే అమెరికాలో చట్టాల రూపకల్పన, ఆమోదంలో కాంగ్రెస్‌ది కీలక పాత్ర. ఇప్పటివరకు తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లిన ట్రంప్‌కు.. ఇకపై డెమోక్రాట్ల నుంచి షాక్‌లు తగలక తప్పదు. ట్రంప్ విదేశాంగ విధాన నిర్ణయాలు, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపార ప్రయోజనాలపై విచారణలు జరిపేందుకు రెడీగా ఉన్నట్టు ఇప్పటికే డెమోక్రాట్లు సిగ్నల్స్‌ ఇస్తున్నారు. అంటే.. అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలో కొనసాగినా, ఆయన నిర్ణయాలపై ప్రశ్నలు, పొలిటికల్ ప్రెజర్ పెరిగే చాన్స్‌ ఫుల్‌గా ఉంది. ఇదే ఇప్పుడు మన దేశానికి కీలకంగా మారింది.

ఇది భారత్‌కు మంచి అవకాశమా?

Advertisement

ట్రంప్‌కు ఎదురైన రాజకీయ దెబ్బను భారత్ ఒక అవకాశంగా భావించే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చల స్టేజ్‌లోనే ఉంది. ముఖ్యంగా ఇంపోర్ట్‌ టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య పంచాయితీ తెగడం లేదు. చైనా, వియత్నాం వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కు మెరుగైన టారిఫ్‌ నిబంధనలు ఉండాలన్నది మనవాళ్లు చేస్తున్న డిమాండ్. ఈ విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఒప్పందం విషయంలో ఏ మాత్రం తొందరలేదు అనే ఫీల్‌లో ఉంది భారత్. అంతేకాదు.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా ఇతర దేశాలు అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నాయా అనే అంశంపై ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 301 కింద భారత్ సహా పలు దేశాలపై దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా ఒప్పందం కుదరకపోవడానికి ఒక రీజన్.

టారీఫ్‌లు రద్దయ్యే అవకాశాలున్నాయా?

ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరగడంతో ట్రంప్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో భారత్‌కు చర్చల్లో మరింత టైమ్ దొరికే చాన్స్ ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం వచ్చినంత మాత్రాన ట్రంప్ విధించిన టారిఫ్‌లు వెంటనే రద్దు కావు. అధ్యక్షుడిగా తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి టారిఫ్‌లు కంటిన్యూ చేస్తారు ట్రంప్. కానీ ఈ టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యాపార సంస్థలకు, ప్రజలకు కలుగుతున్న నష్టాలపై కాంగ్రెస్ విచారణ చేపట్టవచ్చు. అదే జరిగితే అసలు ఈ టారిఫ్‌లు కొనసాగించాలా? వద్దా? అనే దానిపై ట్రంప్‌ మరోసారి ఆలోచించే అవకాశం ఉంది. అంటే.. భారత్‌కు ఒక చాన్స్ ఉన్నా.. ఇప్పుడప్పుడే మనకు అంత కలిసొచ్చేది ఏమీ లేదు.

హెచ్-1బి వీసాల పరిస్థితి ఏమిటీ?

Advertisement

ఈ టైమ్‌లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం.. హెచ్‌-1బీ వీసాలు. అమెరికాలో స్కిల్ ఉన్న విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హెచ్‌-1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇండియన్ ఐటీ ఎక్స్‌పర్ట్స్‌ ఆందోళన కలిగిస్తున్నాయి. హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడంతో పాటు.. అమెరికాలో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థల హెచ్‌-1బీ అప్లికేషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫెడరల్ ఏజెన్సీలను ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. దీని ఇంపాక్ట్‌ ఇండియన్ టెకీలపై పడుతోంది. ఎందుకంటే అమెరికా ఆమోదించే హెచ్‌-1బీ వీసాల్లో మెజారిటీ దక్కించుకునేది ఇండియన్సే. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను పలువురు డెమోక్రటిక్ పార్టీ నేతలు ఇప్పటికే వ్యతిరేకించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు పట్టు పెరగడంతో.. ట్రంప్‌ విధించిన ఆంక్షల వల్ల అమెరికా టెక్ కంపెనీలకు, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వచ్చిందనే దానిపై డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పటికి ఇప్పుడే ఇండియన్ టెకీలకు వెంటనే ఊరట లభించకపోయినా.. లాంగ్‌ రన్‌లో మాత్రం హెచ్‌-1బీ వీసాల విషయంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ఆ విషయంలో మాత్రం ఇండియాపై ఒత్తిడి

అంటే అన్నీ మనకు ఫేవర్‌గా ఉన్నాయా? అంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే డెమోక్రాట్లు గతంలో భారత్‌లో మానవ హక్కులు, మత స్వేచ్ఛ, మైనారిటీల పరిస్థితిపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై వారి పట్టు పెరగడంతో ఈ అంశాలపై భారత్‌ను మరింతగా ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే.. ట్రేడ్, వీసాల విషయంలో భారత్‌కు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నా.. మానవ హక్కుల విషయంలో మాత్రం అమెరికా నుంచి ప్రెజర్‌ పెరగవచ్చు.

Also Read: ట్రంప్‌కు డెమోక్రాట్ల దెబ్బ.. రాబోయే రెండేళ్లలో జరిగేది ఇదే!

మెరుగైన దౌత్య సంబంధాలతోనే ఇండియా సేఫ్

కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అమెరికాలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు రెండు ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. వీటితో పాటు అక్కడి కాంగ్రెస్ సభ్యులు, వ్యాపార సంస్థలు, యూనివర్సిటీలు, రీసెర్చ్ ఏజెన్సీలు కూడా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అందుకే రిపబ్లికన్లకు పట్టు పోయిందనో.. డెమోక్రాట్లు వచ్చారనో ఆనందించడం కంటే.. ఎవరు అధికారంలో ఉన్నా భారత్ ప్రయోజనాలు కాపాడేలా మన దౌత్యం ఉండాలనేది అసలు విషయం. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ ఉండొచ్చు.. రేపు మరో అధ్యక్షుడు రావొచ్చు.. అధికారంలో రిపబ్లికన్లు ఉండొచ్చు.. లేదా డెమోక్రాట్లు గెలవొచ్చు.. కానీ భారత్ ప్రయోజనాలు మాత్రం మారకూడదు. అందుకే వ్యక్తులు, పార్టీలతో స్నేహం చేయడం కంటే.. దేశంతో బలమైన సంబంధాలు నిర్మించుకోవడమే అసలైన దౌత్యం. ఏదేమైనా అమెరికా రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు.. భారత్‌కు కొత్త అవకాశాలు తెస్తుందా? లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags

Related News

ట్రావెలర్లకు బిగ్ అలర్ట్.. కువైట్ ఎయిర్‌పోర్టులో ఫోటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం

మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, వందల కోట్ల నష్టం కూడా

ట్రంప్‌కు డెమోక్రాట్ల దెబ్బ.. రాబోయే రెండేళ్లలో జరిగేది ఇదే!

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. భారతీయ సంతతికి చెందిన నేతల జోరు, వారంతా డెమోక్రటిక్ సభ్యులు

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీ కంచుకోటలు బద్దలు, ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మధ్యంతర ఎన్నికల వేళ.. ఇరాన్‌లోని ఖేష్మ ద్వీపంపై అమెరికా దాడులు, మళ్లీ ఏం జరిగింది?

రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన

Big Stories

Advertisement
×