Survival Thriller: మనిషికి, జంతువుకు మధ్య ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా కష్టకాలంలో మనుషులే దూరమైనా, తమ యజమానిని వదలకుండా తోడుగా నిలిచే పెంపుడు జంతువుల కథలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. అలాంటి మనిషి, కుక్క మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని సర్వైవల్ థ్రిల్లర్ నేపథ్యంలో చూపించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ ది బీస్ట్’ (Heart of the Beast). హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించగా, ‘ఫ్యూరీ’, ‘ది బీ కీపర్’ వంటి యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన డేవిడ్ అయర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2026సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అలాస్కా మంచు అరణ్యంలో జరిగే ప్రాణాంతక పోరాటాన్ని ఉత్కంఠభరితంగా చూపిస్తుంది.
జేమ్స్ బెల్మాంట్ (బ్రాడ్ పిట్) ఒక మాజీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి. సైన్యంలో పనిచేసిన సమయంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న అతనికి ఓడిన్ అనే కాంబాట్ డాగ్ తోడుగా ఉంటుంది. యుద్ధంలో కలిసి పనిచేసిన వీరిద్దరి మధ్య యజమాని, పెంపుడు కుక్కకు మించిన అనుబంధం ఉంటుంది. కష్టసమయాల్లో ఒకరికి మరొకరు అండగా నిలుస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు.
అయితే ఒకరోజు వీరిద్దరూ ప్రయాణిస్తున్న విమానం అనుకోకుండా అలాస్కాలోని దట్టమైన అరణ్యంలో కూలిపోతుంది. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, అంతులేని అడవి, ఎముకలు కొరికే చలి… ఎటు చూసినా ప్రమాదకరమైన పరిస్థితులే కనిపిస్తాయి. ఈ ఘోర ప్రమాదం నుంచి జేమ్స్, ఓడిన్ మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. సమీపంలో జనావాసాలు కనిపించవు. సహాయం కోసం ఎవరిని సంప్రదించే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడటమే వారి ముందున్న అతిపెద్ద సవాలుగా మారుతుంది.
ప్రమాదంలో గాయపడిన జేమ్స్‌కు నడవడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో ఓడిన్ అతనికి అండగా నిలుస్తుంది. ఆహారం, నీరు, సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతూ ఇద్దరూ ముందుకు సాగాల్సి వస్తుంది. ఒకవైపు తీవ్రమైన వాతావరణం, మరోవైపు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు వారిని ప్రతి క్షణం పరీక్షిస్తుంటాయి. శారీరకంగా బలహీనపడుతున్న జేమ్స్‌కు ఓడిన్ తోడుగా ఉండటం అతనిలో ధైర్యాన్ని నింపుతుంది.
అయితే ప్రకృతితో చేసే ఈ పోరాటం అంత సులభంగా ముగిసేలా కనిపించదు. ఒకప్పుడు యుద్ధభూమిలో కలిసి పోరాడిన ఈ ఇద్దరు, ఇప్పుడు మనుగడ కోసం మరో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడి తిరిగి ఇంటికి చేరుకోగలరా? ప్రాణాలను పణంగా పెట్టి తన యజమానిని కాపాడేందుకు ఓడిన్ ఎలాంటి సాహసాలు చేస్తుంది? అనే అంశాలతో ఈ సినిమా క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సర్వైవల్ థ్రిల్లర్స్‌తో పాటు జంతువుల నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఆసక్తికరంగా అనిపించవచ్చు.
‘హార్ట్ ఆఫ్ ది బీస్ట్’ చిత్రంలో బ్రాడ్ పిట్, జె.కె. సిమన్స్, అన్నా లాంబే లీడ్ రోల్స్ లో నటించారు. ఓడిన్ పాత్రలో ఉబర్ అనే శిక్షణ పొందిన కుక్క నటించింది. డేవిడ్ అయర్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ విజువల్ వండర్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. ప్రముఖ ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ BookMyShow Stream లో ఈ సినిమా అఫీషియల్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంగ్లీష్ చిత్రాన్ని హిందీ ఆడియో డబ్బింగ్ ఆప్షన్ తో రెంట్ లేదా బై (Rent/Buy) బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
Read Also: ఇంట్లో చావుల పరంపర… వెళ్లిన వాళ్లను వదలకుండా వెంటాడే దెయ్యం… హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హారర్