మీకు థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? అయితే, నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన తప్పకుండా మీకు నచ్చేస్తుంది. చైనాకు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోడానికి ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. విజయవంతంగా 19 ఏళ్లు పోలీసుల కళ్లుగప్పి మరొకరిలా జీవించడం మొదలుపెట్టాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇదిగో ఇలా…
సాధారణంగా చైనావాళ్లను చూసేందుకు ఒకేలా ఉంటారు. అలాంటిది కవల సోదరులను గుర్తుపెట్టడం ఎంత పెద్ద టాస్కో అర్థం చేసుకోండి. బహుశా.. అక్కడి పోలీసులకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతడు ఏకంగా 19 సంవత్సరాల పాటు తాను చనిపోయినట్లు నమ్మించాడు. ప్రమాదంలో మరణించిన తన కవల సోదరుడి పేరు, గుర్తింపును వాడుకుంటూ సమాజంలో హాయిగా తిరిగాడు. చివరికి అతడి మాజీ ప్రియురాలి ఎంట్రీతో దొరికిపోయాడు.
2002లో చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో చెన్ అనే వ్యక్తి ఆరుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేయగా, చెన్ మాత్రం పరారయ్యాడు. పోలీసులు ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత, 2007లో పోలీసులకు ప్రభుత్వ అధికారుల నుంచి ఒక నివేదిక వచ్చింది. పరారీలో ఉన్న నిందితుడు చెన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, అతని పౌరసత్వ రికార్డులను రద్దు చేశామని అందులో ఉంది. దీంతో చెన్ నిజంగానే చనిపోయాడని భావించిన పోలీసులు ఆ కేసు ఫైల్ను క్లోజ్ చేశారు.
కొన్నేళ్ల తర్వాత పోలీసులు పాత కేసులను రీ-ఓపెన్ చేసి పరిశీలించగా అసలు విషయం బయటపడింది. 2007లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది నిందితుడు చెన్ కాదని, అతని రూపురేఖలతోనే ఉండే అతని కవల సోదరుడు అని తేలింది. అన్న మరణాన్ని చెన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడని, అతడి గుర్తింపు కార్డులు, పేరును ఉపయోగిస్తూ కొత్త వ్యక్తిలా బతకడం ప్రారంభించాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇందుకు చెన్ తల్లి, సోదరి, ఊరి ప్రజలు కూడా సహకరించారు.
Also Read: 19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!
దీనిపై పోలీసులు విచారణ జరపగా.. కుటుంబ సభ్యులు చెన్ చనిపోయాడని బుకాయించారు. అయితే, ఐడెంటిటీ కార్డు ఫొటోలను నిశితంగా పరిశీలించిన పోలీసులకు ఒక క్లూ దొరికింది. 2007లో చెన్ చనిపోయాడని రికార్డయిన 9 రోజులకు అతని అన్న పేరు మీద ఉన్న కార్డుకు కొత్త ఫొటో పెట్టి అప్డేట్ చేశారు. అయితే, ఈ విషయాన్ని కోర్టులో నిరూపించాలంటే చాలా కష్టం. ఇందుకు బలమైన సాక్ష్యం కావాలి. దీంతో పోలీసులు చనిపోయిన అతడి అన్న మాజీ ప్రియురాలు డెంగ్ను సంప్రదించారు. ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. అప్పట్లో ప్రమాదంలో చనిపోయింది తన ప్రియుడేనని ఆమె చెప్పింది. ఇప్పుడు అతని పేరుతో తిరుగుతున్నది నేరస్తుడైన చెన్ ఆమె స్పష్టం చేసింది. దీంతో పోలీసులు చెన్ను అరెస్టు చేసి.. కటకటాల్లోకి నెట్టారు.