పెళ్లి చేసుకుంటే లాభమా, నష్టమా..? అసలు లాభ నష్టాల బేరీజు వేసుకోలేమని, వివాహం, కుటుంబ జీవనం అనేవి ప్రేమాభిమానాలకు సంబంధించిన విషయాలని అంటారు కొందరు. ఆయితే కొన్ని దేశాల్లో మాత్రం పెళ్లిని వివిధ ఆఫర్లతో ముడిపెట్టాయి ప్రభుత్వాలు. పెళ్లికి, పిల్లలకు దూరమవుతున్న యువతను దారికి తెచ్చుకోడానికే ప్రభుత్వాలు ఆఫర్లు ప్రకటించాయి. ఇంతకీ ఏయే దేశాల్లో ఏమేం ఆఫర్లు ఇస్తున్నారో ఓసారి చూద్దాం.
హంగేరీలో లోన్ ఆఫర్లు
హంగేరీలో యువత పెళ్లిని వాయిదా వేయడంతో అక్కడ జనాభా భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకోడానికి అక్కడ పిల్లలే కనపడ్డం లేదు. అందుకే హంగేరీ ప్రభుత్వం పెళ్లిని వాయిదా వేస్తున్న బ్రహ్మచారులను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు ప్రకటించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం 30వేల డాలర్లు లోన్ ఇస్తామని ప్రకటించింది. ఈ లోన్ కి వడ్డీ రాయితీ ఇస్తారు. పెళ్లి కూతురు వయసు 40 ఏళ్లకంటే తక్కువగా ఉండి, కొత్తజంటకి అది తొలి వివాహం అయితే లోన్ వెంటనే మంజూరు చేస్తారు. ఇక సదరు జంట ముగ్గురు పిల్లల్ని కంటే వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తారు. అంటే ఆ లోన్ కాస్తా గ్రాంట్ గా మారుతుందన్నమాట. తమ దేశంలోని యువతుల్ని పెళ్లి చేసుకుని, అక్కడే స్థిరపడే విదేశీయులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని చెబుతోంది హంగేరీ ప్రభుత్వం.
చైనాలో పన్ను రాయితీ, సబ్సిడీలు..
ఒకప్పుడు అధిక జనాభాతో సతమతమైన చైనా, ఇప్పుడు జననాల రేటు పడిపోవడంతో ఇబ్బంది పడుతోంది. పైగా అక్కడ లింగ అసమానత ఎక్కువ. మహిళల సంఖ్య కంటే పురుషుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో చాలామంది బ్రహ్మచారులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. దీన్ని నివారించేందుకు అక్కడ వివాహ ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు, పన్నుల్లో రాయితీ, ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీ రుణాలు అందిస్తోంది.
జపాన్ గ్రాంట్లు..
జపాన్ లో కూడా సేమ్ ప్రాబ్లమ్. జనాభా సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా యువత సంఖ్య పడిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని నివారించడానికి చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకోవాలంటూ యువతను పోరు పెడుతోంది. పెళ్లి చేసుకున్న వారికి వివాహ సబ్సిడీలు ఇవ్వడంతోపాటు, వారికి పుట్టిన పిల్లల భారాన్ని ప్రభుత్వమే తీసుకుంటానంటోంది.
సింగపూర్ ప్రోత్సాహకాలు
సింగపూర్ ప్రభుత్వం పెళ్లి ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చింది. పిల్లలు పుడితే బేబీ బోనస్ ని కూడా ఇస్తోంది. ఇంత చేస్తున్నా కూడా సింగపూర్ లో ఎవరూ త్వరగా పెళ్లి చేసుకోడానికి ఉత్సాహం చూపించట్లేదు.
అర్మేనియాలో ఆఫర్లు..
విదేశీయులెవరైనా అర్మేనియా వెళ్లి, అక్కడి అమ్మాయిని వివాహం చేసుకుని స్థిరపడితే వారికి ఆఫర్లతో స్వాగతం చెబుతుంది స్థానిక ప్రభుత్వం. విదేశీయులకు కూడా ప్రోత్సాహకాలిచ్చి పెళ్లిళ్ల సంఖ్యను పెంచాలని చూస్తోంది. ఆర్థిక ప్రయోజనాలతోపాటు, పిల్లల్ని పెంచేందుకు కూడా తోడ్పాటుని అందిస్తుంది.
లాత్వియాలో 3వేల డాలర్లు..
లాత్వియాలో జనాభా అసమతుల్యత ప్రాంతాలనుబట్టి విస్తరించింది. జనాభా సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థిరపడితే ఆయా జంటలకు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది ప్రభుత్వం. 3వేల డాలర్లను గ్రాంట్ గా మంజూరు చేస్తుంది.
కెనడాలో హౌస్ అలవెన్స్..
కెనడాలో వివాహం చేసుకునే జంటలకు హౌస్ అలవెన్స్, గ్రాంట్లు, పన్ను ప్రయోజనాలు అందిస్తామని చెబుతోంది ప్రభుత్వం. అక్కడికి వలస వెళ్లిన వారు కూడా ఈ అన్ని ప్రయోజనాలు పొందుతారు. స్థానిక జనాభాను పెంచడానికి, కొత్త కుటుంబాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.
రండి బాబూ రండి..
కొన్ని దేశాలు విదాశాల నుంచి వస్తున్న బ్రహ్మచారులకు కూడా ఆఫర్ల వల విసురుతున్నాయి. వారికి తమ దేశంలో స్థిరపడే అవకాశం కల్పిస్తూనే ఆర్థిక సాయం చేస్తున్నాయి. రండి బాబూ రండి, మా దేశంలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకుండి, పిల్లా పాపలతో సుఖంగా ఇక్కడే ఉండండి అంటూ ఆఫర్లిస్తున్నాయి.