Putin: ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి వందేళ్లు బతకడం అంటే గగనం. కానీ 150 ఏళ్లు బతికేయచ్చొంటున్నారు పుతిన్. అదెలాగో కూడా చెప్పేశారు. ఇంతకీ పుతిన్ ఈ ఏజ్‌లో ఈ రేంజ్ ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడానికి.. ఆయన చెప్తున్న మాటలకి ఏదైనా లింక్ ఉందా? ఆయన 150 ఏళ్లు బతికేస్తారా?
తలుచుకుంటే చావును కూడా జయించవచ్చన్న పుతిన్
వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచం మొత్తానికి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని పేరు. ఇప్పటికే ఆయన చాలా అంశాల్లో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారారు. కానీ ఆయన చైనాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మనిషి తలుచుకుంటే చావును కూడా జయించవచ్చన్నది ఆయన మాటల సారాంశం. బీజింగ్‌లో సైనిక పరేడ్ చూసేందుకు వెళుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేశారు పుతిన్.
150 ఏళ్ల వరకు జీవించగలరన్న జిన్‌పింగ్
ప్రస్తుతం బయోటెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, పాడైపోతున్న శరీర అవయవాలను మార్పిడి చేసుకుంటూ చాలా కాలం జీవించవచ్చన్నారు పుతిన్.. ఈ మాటలపై స్పందించిన జిన్‌పింగ్ సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ శతాబ్దంలో మనుషులు 150 ఏళ్ల వరకు జీవించగలరంటూ చెప్పారు. ఈ డిస్కషన్ వింటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నవ్వుతూ కనిపించారు. ఈ విషయాలను పుతిన్ మరోసారి కన్ఫామ్ చేశారు.. జిన్‌పింగ్ ఆ మాటలను అన్నారని.. లెటెస్ట్ టెక్నాలజీని చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తోంది అన్నారు.
వృద్ధాప్యం జాడ కనిపించకుండా జాగ్రత్తలు
నిజానికి పుతిన్‌ని చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పుతిన్ ప్రస్తుత వయస్సు 72 ఏళ్లు. కానీ అలా అస్సలు కనిపించరు పుతిన్. ఆయన ఫిట్‌నెస్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. వృద్ధాప్యం జాడ ఆయన ఫేస్‌లో ఎక్కడా కనిపించదు. యంగ్‌స్టర్స్‌లానే ఉత్సాహంగా ఉండటంతో పాటు.. వారితో పోటీ పడేలా ఉంటారు పుతిన్. నిజానికి ఆయన డెయిలీ రోటిన్, ఆహారపు అలవాట్ల విషయంలో ఎక్కడా తగ్గరనే టాక్ ఉంది.
జూడోలో పుతిన్‌కు బ్లాక్ బెల్ట్
నిజానికి పుతిన్ చిన్నప్పటి నుంచే ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాదు.. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారు. 60 సంవత్సరాల వయస్సులో ఐస్ హాకీ మొదలు పెట్టారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంచడంతో పాటు.. ఆయన మానసిక శక్తిని పెంచాయనేది ఓ వాదన. అంతేకాదు.. రోజూ కాస్త ఆలస్యంగా లేచే పుతిన్.. తన రోజును స్విమ్మింగ్‌తో ప్రారంభిస్తారనే టాక్ ఉంది. ఆ తర్వాత వ్యాయామాలు తప్పనిసరి.
Also Read: తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..
పుతిన్‌కు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్స్ జరిగాయా?
పుతిన్ షర్ట్‌లెస్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతాయి. గుర్రపుస్వారీ చేయడం.. చేపలు పట్టేందుకు వెళ్లాడం, షూటింగ్, హంటింగ్ ఇలా అనేక కార్యక్రమాలు చేస్తారు పుతిన్. అంటార్కిటికాలో ఐస్ బాత్, అండర్ వాటర్ సీ అడ్వేంచర్స్, కుర్రవాళ్లతో జూడోలో పోటీ పడటం.. పుతిన్ లైఫ్‌లో కామన్‌గా జరిగేవే. అయితే పుతిన్ ఫిట్‌నెస్ సీక్రెట్స్‌కు వీటితో పాటు.. ఆయన చెప్పినట్టు ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్స్ జరిగాయా? అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిన ప్రశ్న. ఎందుకంటే యంగ్‌గా ఉండేందుకు ఇప్పుడున్న బయోటెక్నాలజీ సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయనే చెబుతున్నారు. సో.. వీటిని ఆయన ఉపయోగించుకుంటున్నారా? అందుకే ఇంత యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నారా? అనే చర్చ ప్రారంభమైంది. ఇదే నిజమైతే జిన్‌పింగ్ చెప్పినట్టు.. 70 ఏళ్ల వయసులో చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న పుతిన్.. 150 ఏళ్ల వరకు పెద్దవాడుగా మారుతాడేమో.