MRI Accident: అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 61 ఏళ్ల కీత్ మెక్‌ఆల్లిస్టర్ అనే వ్యక్తి ఎంఆర్ఐ మెషీన్‌లో జరిగిన ప్రమాదానికి బలై ప్రాణాలు కోల్పోయాడు. భార్యకు వైద్య పరీక్ష జరుగుతుండగా, ఆమెను సహాయం చేయడానికి ఎంఆర్ఐ గదిలోకి వచ్చిన కీత్, మెడలో వేసుకున్న భారీ మెటల్ చైన్ కారణంగా ఆ యంత్రంలోకి దూసుకెళ్లాడు. ఆ క్షణం నుంచే అతని జీవితం మరణ పోరాటంలోకి జారుకుంది.
ఆ రోజు కీత్ భార్య ఆడ్రియెన్ knee scan కోసం ఎంఆర్ఐ గదిలో పడుకున్నది. స్కాన్ ముగిసిన తర్వాత లేచి కూర్చోడానికి సహాయం చేయమని టెక్నీషియన్‌కి చెప్పింది. టెక్నీషియన్ ఆమె భర్తను బయట నుంచి పిలిచాడు. అనుకోకుండా మెడలో మెటల్ చైన్ వేసుకున్న కీత్ గదిలోకి అడుగుపెట్టగానే శక్తివంతమైన మాగ్నెట్ అతన్ని బలంగా లోపలికి లాగేసింది. ఆ క్షణంలోనే భార్య ఆడ్రియెన్ ఆందోళనతో కేకలు వేసింది. మెషీన్ ఆఫ్ చేయండి, 911కి కాల్ చేయండి, ఏమైనా చేయండి అంటూ ఆర్తనాదం చేసింది. కానీ అప్పటికే కీత్ యంత్రానికి అతుక్కుపోయి తీవ్రంగా శ్వాస ఆడక మూర్చపోయాడు. ఆడ్రియెన్ చెప్పిన ప్రకారం.. అతను చివరిసారి నాకు చేతి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు.. వెంటనే కన్నుమూశాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.
ఒక గంటకు పైగా కీత్‌ను ఆ మెషీన్ నుంచి బయటకు తీయలేకపోయారు. చివరికి బయటకు తీయగలిగే సరికి పరిస్థితి విషమంగా మారింది. గుండెపోటుతో కీత్ ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజే అతను కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందిస్తూ.. మెడలో ఉన్న భారీ మెటల్ చైన్ ఎంఆర్ఐ మెషీన్ మాగ్నెట్ ఆకర్షణకు గురై ప్రమాదం జరిగింది. దీనివల్ల అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని వివరించారు.
ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే టెక్నీషియన్ తప్పిదం. ఆయనే కీత్‌ను గదిలోకి పిలిచి తీసుకొచ్చాడు. కానీ ఎంఆర్ఐ గదిలోకి లోపలికి వెళ్లే ముందు ఎలాంటి మెటల్ వస్తువులు ఉండకూడదని చెప్పడం మరచిపోయాడు. ఆ ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని కూలదోసింది.
Also Read: Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!
కీత్ సవతి కుమార్తె సమంతా బోడెన్ ఈ దారుణ ఘటన తర్వాత తన తల్లిని ఆదుకోవడానికి GoFundMe పేజీ ఏర్పాటు చేసింది. ఆ పేజీలో వివరాలు చెబుతూ.. టెక్నీషియన్ స్వయంగా నా తండ్రిని గదిలోకి పిలిచాడు. కానీ అతను మెటల్ చైన్ తీసేయమని చెప్పలేదు. యంత్రం లోపలికి బలంగా లాగేసింది. మేము ఎంతోసేపు ప్రయత్నించాం కానీ విడదీయలేకపోయాం. చివరకు ఆయన మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేసింది.
సమాజం నుంచి ఈ కుటుంబానికి విపరీతమైన సహాయం లభించింది. 4 రోజుల్లోనే 14,000 డాలర్లు కంటే ఎక్కువ విరాళాలు సమకూరాయి. కుటుంబం ఆ సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. డబ్బు మాత్రమే కాదు, ప్రతి ప్రార్థన, ప్రతి సానుభూతి మాకు ధైర్యం ఇచ్చిందని సమంతా తెలిపారు. ఆడ్రియెన్ మాత్రం ఈ ఘటన తర్వాత తీవ్ర మనోవేదనలో కూరుకుపోయింది. నిద్ర రావడం లేదు, తినడం లేదు. ఇంకా ఇది నిజమని నమ్మలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరై విలపించింది. జూలై 17న జరిగిన ఈ ఘటన తర్వాత, ఆగస్టు 1న కీత్ అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రజల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ప్రభువు మీకు శాంతి ఇవ్వాలి, ధైర్యం కలిగించాలని ఒకరు రాశారు. మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటామని మరొకరు మద్దతు తెలిపారు. మొత్తం మీద, ఎంఆర్ఐ గదిలోని ఒక చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబానికి తిరుగులేని నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన ప్రపంచానికి ఒక బలమైన హెచ్చరిక. మెటల్ వస్తువులు ఎంఆర్ఐ గదిలోకి ఎందుకు అనుమతించరని దీని ద్వారానే మరోసారి స్పష్టమైంది. వైద్యరంగం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో ఇది కఠినమైన పాఠం నేర్పింది.