మయన్మార్ భూకంపం ఎంత భయంకరంగా ఉందో జరిగిన నష్టాన్ని బట్టి అంచనా వేయొచ్చు. అయితే అది అంతకంటే దారుణమైన హెచ్చరికలను జారీ చేసినట్టు ఇప్పుడు స్పష్టమవుతోంది. భూకంపం జరిగిన సమయంలో శాటిలైట్ తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దాదాపు 500 కిలోమీటర్ల పొడవున 5 మీటర్ల వెడల్పుతో భూమి నిట్టనిలువునా చీలిపోయింది. ఈ చీలిక శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనపడుతోంది. ఇది ప్రకృతి విపత్తే, కానీ మానవాళికి ప్రకృతి ఇచ్చిన అతి పెద్ద హెచ్చరిక. భవిష్యత్తులో రాబోయే మరిన్ని ఉపద్రవాలకు ఇది సూచన.
3వేలమంది దుర్మరణం
మయన్మార్ భూకంపం ఈ శతాబ్దంలోనే అతి పెద్దది అని అంటున్నారు శాస్త్రవేత్తలు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం కారణంగా దాదాపు 3వేలమంది మరణించారు. వేలకోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాదిమందిపై ఈ ప్రభావం పడింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోయినవారు, ఆస్తుల్ని కోల్పోయినవారు, చివరకు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ వారు.. ఇలా ఎవర్ని కదిలించినా ఏదో ఒక దీనగాధ. 28లక్షలమంది ప్రజలు నివశించే ప్రాంతంలో ఈ విధ్వంసం జరిగింది.
మాక్సర్ ఉపగ్రహ చిత్రాలు
మయన్మార్ లో రెండో అతిపెద్ద నగరం మండలే. ఈ నగరానికి సమీపంలోనే భూకంప కేంద్రం ఉంది. కేంద్రం నుంచి నాలుగు దిక్కులా దాని తీవ్రత వ్యాపించింది. తాజాగా ఈ విపత్తుకి సంబంధించి మాక్సర్ ఉపగ్రహం కొన్ని చిత్రాలు విడుదల చేసింది. ఈ ఫొటోలను నహేల్ బెల్గెర్జ్ అనే ఔత్సాహిక వాతావరణ నిపుణుడు విశ్లేషించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచి విపత్తు తీవ్రతను తెలియజేశాడు. నహేల్ ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. పలు మీడియా సంస్థలు ఆయన ట్వీట్ ఆధారంగా కథనాలు ప్రచురించాయి. మాక్సర్ ఉపగ్రహం మయన్మార్ భూకంపాన్ని కళ్లకు కట్టేట్టుగా చిత్రీకరించింది. అతి సూక్ష్మమైన వివరాలు కూడా దీని ద్వారా అందాయి. కొన్నిచోట్ల ఈ ఉపగ్రహ చిత్రాలు సహాయక చర్యలకు కూడా ఉపయోగపడటం విశేషం.
Newly available high-resolution satellite imagery collected by Maxar reveals sections of the surface rupture near the zone of maximum surface displacement of last week’s Mw 7.7 earthquake in Myanmar. Rupture is ~500 km long, with up to 5 meters of fault slip. pic.twitter.com/GmhxKtZ8ht
— Nahel Belgherze (@WxNB_) April 2, 2025
నిట్టనిలువుగా చీలిన భూమి..
500 కిలోమీటర్ల మేర భూమి నిట్టనిలువుగా చీలిపోవడం అంటే మామూలు విషయం కాదు. గతంలో అత్యంత తీవ్ర నష్టం కలిగించిన భూకంపాల విషయంలో కూడా ఇలాంటి ఉదాహరణలు లేవు. అది కూడా 5 మీటర్ల వెడల్పుతో భూమి సర్దుబాటు చేసుకోవడం ఇక్కడ విశేషం. భూమి నిర్మాణంలో టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిపై ఒకటి అమరి ఉంటాయి. వాటి మధ్య నిరంతరం సర్దుబాట్లు జరుగుతుంటాయి. అయితే ఆ సర్దుబాట్లు తీవ్రంగా ఉంటే దాన్ని మనం భూకంపం అంటాం. అలాంటి భూకంపాల్లోనే అత్యంత తీవ్రమైనది మయన్మార్ లో సంభవించింది. సెస్మెగ్రాఫ్ పై దాని తీవ్రత సాధారణంగానే ఉండొచ్చు. కానీ మాక్సర్ ఉపగ్రహం పంపించిన హై రెజొల్యూషన్ చిత్రాలు మాత్రం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. భూకంపం అంటే భూమి అంతర్భాగంలో జరిగే సర్దుబాట్లే కానీ, భూమిపై జరుగుతున్న వినాశనానికి, మానవ ప్రమేయం ఉన్న విధ్వంసానికి భూమి స్పందించే తీరు అని కూడా పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతుంటారు. ఈసారి మయన్మార్ భూకంపం మానవాళికి అత్యంత పెద్ద హెచ్చరిక పంపించిందని చెబుతున్నారు.