YS Sharmila : వైఎస్ షర్మిలారెడ్డి. APCC చీఫ్. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండేవారు. దాదాపు ప్రతీరోజూ ట్వీట్లు చేసేవారు. రెగ్యులర్‌గా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రత్యర్థి పార్టీలను, నేతలను విమర్శించేవారు. తరుచూ ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై పోరాటం చేసేవారు. అలాంటి షర్మిల కొంతకాలంగా కనిపించడం లేదు. ఎక్స్ లో లేరు. మీడియా ముందుకు రాలేదు. జనాలకు ముఖం కూడా చాటేశారు. ఏమయ్యారు? ఏపీ కాంగ్రెస్ అధినేత్రి ఎక్కడకు వెళ్లారు? ఇదే చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించారు. చాలా కాలం తర్వాత ఆమె నుంచి వచ్చిన రియాక్షన్ ఇది. లేటెస్ట్‌గా విజయవాడ ఇందిరా భవన్‌కు వచ్చారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇంకేం.. ఆవిడ వచ్చారంటే.. మాటలు పటాసుల్లా పేలాల్సిందేగా. అదే జరిగింది.. మోదీ, చంద్రబాబు, అవినాష్, ప్రవీణ్ పగడాల వరకూ.. అందరికీ తలా ఓ డోస్ ఇచ్చారు. పనిలో పనిగా మేడమ్ మిస్సింగ్ గురించి కూడా మాట్లాడారు.
మేడమ్ మిస్సింగ్ నిజమేనా?
తాను కనిపించడం లేదనేది అవాస్తవమని.. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా.. అంటూ మీడియాపై సెటైర్లు వేశారు. తమ పార్టీ నేత శైలజానాథ్ వైసీపీలో చేరడాన్ని తప్పుబట్టారు షర్మిల. ఆ పార్టీలో అధికారం లేదు.. డబ్బు మాత్రమే ఉంది.. అందుకే పోయి ఉండొచ్చని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు తమ పార్టీపై ఫోకస్ చేసి లీడర్లను లాగుతున్నారంటే.. కాంగ్రెస్‌ను చూసి భయపడుతున్నట్టేగా అని కౌంటర్ ఇచ్చారు.
అమరావతికి మోదీ సున్నం కొట్టి పోతారు..
అమరావతి రెండో దశ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తుండటంపైనా షర్మిల తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. ఒకసారి వచ్చి మట్టి కొట్టి పోయారని.. ఈసారి వచ్చి సున్నం కొట్టి పోతారంటూ కామెంట్ చేశారు.
ఇఫ్తార్ విందు ఇచ్చి.. విషం పెట్టినట్లే!!
సీఎం చంద్రబాబుపై సైతం షర్మిల పదునైన విమర్శలే చేశారు. వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇవ్వడం అంటే.. ముస్లింలకు వెన్నుపోటు పొడిచినట్లేనని.. ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో విషం పెట్టినట్లేనని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లింలకు మేలు చేసేవి కావని.. వాటి ఆస్తులు కాజేసే కుట్ర అని అన్నారు. చంద్రబాబుకు ముస్లింలు ఓట్లు వేయలేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతుంటే.. ఏపీలో వక్ఫ్ బోర్డు మీద ముఖ్యమంత్రి సమీక్ష పెట్టారని.. దీనిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నీచ రాజకీయాలు
ప్రవీణ్ పగడాల విషయంలో వైసీపీ వాళ్లు నీచ రాజకీయం చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏపీలో బీజేపీ కుట్ర చేసి.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని తప్పుబట్టారు. ఆంధ్రలో ఇంకా అటువంటి కల్చర్ రాలేదని అన్నారు. పోలీసులు వీడియోలు బయట పెడుతున్నారని.. కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందని ఆశించారు. ఒకవేళ
ప్రవీణ్ పగడాలది హత్య అని ఆధారాలు దొరికితే తాను వారి పక్షాన డీజీపీని కలుస్తానని చెప్పారు షర్మిల.
Also Read : రిషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు సంచలన నిర్ణయం!
అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉంటే ఎట్టా?
ఇక.. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకూ తనకూ ఎలాంటి విబేధాలు లేవన్నారు. తాను ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్లనో తెలిసి కూడా సునీతకు సపోర్ట్‌గా నిలుస్తు్న్నానని చెప్పారు. అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. బెయిల్‌పై బయట ఉండి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే ఇక ఏం న్యాయం జరుగుతుంది? సునీత ప్రాణాలకు రక్షణ ఏదని షర్మిల ప్రశ్నించారు.