Nepal Crisis: నేపాల్ సంక్షోభం ముగిసినట్టేనా? పాత పాలకులు రాజీనామాలతో ఆందోళనకారులు వెనక్కి తగ్గేనా? ఉద్యమం ముసుగులో అరాచక శక్తులు రెచ్చిపోతున్నారా? ఉద్యమం మాటున దోపిడీలకు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారా? అవుననే అంటోంది నేపాల్ ఆర్మీ. ప్రభుత్వం కుప్పకూలడంతో పాలనా పగ్గాలు చేపట్టింది ఆర్మీ. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించింది. నేపాల్‌కి కాబోయే కొత్త ప్రధాని ఎవరు? రాపర్‌కి అక్కడి ప్రజలు పగ్గాలు అప్పగిస్తారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
నేపాల్ వ్యాప్తంగా ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆందోళన ముసుగులో అరాచక శక్తులు రెచ్చిపోయారు. దోపిడీలకు, అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని నేపాల్ ఆర్మీ స్వయంగా తెలిపింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది.
నిరసనకారుల ప్రధాన డిమాండ్ మేరకు దేశాధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయడంతో పాత ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని, సామాన్యుల ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించాలని తెలిపింది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించింది ఆర్మీ. ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ ఆదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇంతకీ నేపాల్ కు కాబోయే ప్రధాని ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి రాజీనామాతో నేపాల్ కి కొత్త ప్రధాని ఎవరు? ఇప్పుడు అందరి దృష్టి ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా వైపు పడింది. ఆయన్ని అక్కడి ప్రజలు ముద్దుగా బాలెన్ అని పిలుస్తారు. ఈ ఉద్యమం వెనుక నాయకత్వం వహిస్తున్న జనరల్ జెడ్-నిరసనకారులకు మార్పు కోసం సూచించే ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. బాలెన్ అత్యున్నత పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా నిరసనకారులు ముందుకొచ్చి నేపాల్‌కు నాయకత్వం వహించాలని కోరుతున్నారు.
ALSO READ: మనుషులను తగలబెట్టేంతగా సోషల్ మీడియాలో ఏముంది?
బాలెన్ వయస్సు 35 ఏళ్లు. మూడేళ్ల కిందట అంటే 2022 మే నుంచి ఖాట్మండు 15వ మేయర్‌గా పని చేశారు. ఆనాటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఏ పార్టీ మద్దతు లేకుండా ఆ పదవి చేపట్టిన మొదటి వ్యక్తి ఆయన. బాలెన్ ఇండియాలో చదివాడు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్‌తో ఆయన మంచి సంబంధం కలిగి ఉన్నాడు.
రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు నేపాల్‌కి సంబంధించి హిప్-హాప్ సన్నివేశంలో పాల్గొన్నాడు. అవినీతి- అసమానతలను తగ్గించడానికి తీవ్రంగా కృషి చేశాడు. రెండేళ్ల కిందట ఆదిపురుష్ సినిమాలో ఓ డైలాగ్ కారణంగా ఖాట్మండులో భారతీయ సినిమాల ప్రదర్శనను నిషేధించడం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించాడు బాలెన్. నేపాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కరెక్ట్ అని భావిస్తోంది అక్కడి యువత.