BigTV English

Newyork : వలసలతో న్యూయార్క్ విలవిల

Newyork : వలసలతో న్యూయార్క్ విలవిల
Newyork

Newyork : వలసల సంక్షోభంలో చిక్కుకుని అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ విలవిలాడుతోంది. నిరుడు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1,22,000 మంది అక్రమ వలస‌దారులు నగరానికి పోటెత్తారు. కొన్ని నెలలుగా రోజుకు 400 మంది శరణార్థులు చేరుతుండగా.. ఇప్పుడా సంఖ్య 600‌కి చేరింది. వారికి ఆశ్రయం కల్పించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. లాటిన్ అమెరికాతో పాటు క్యూబా, హైతీ, గ్వాటెమలా, నికరాగ్వా తదితర కరీబియన్ దేశాల నుంచి వలసలు అధికమయ్యాయి. అమెరికా-మెక్సికో దక్షిణ సరిహద్దుల గుండా వారంతా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. సెనెగల్, గినియా వంటి ఆఫ్రికా దేశాల నుంచీ అక్రమ వలసలు తప్పడం లేదు.


బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డర్ పెట్రోల్ పోలీసులు 60 లక్షల మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వెనెజులా నుంచి కూడా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 2023 ఫిబ్రవరి నాటికి 70 లక్షల మంది వలసదారులు వెనెజులాను వీడారని అంచనా. ప్రపంచంలో ఇదే అతి పెద్ద వలస సంక్షోభంగా చెప్పొచ్చు. వలసల విషయంలో బైడెన్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా సమస్యను మరింత జటిలం చేసింది.

వలసల బెడద అమెరికాలోని పలు రాష్ట్రాలకు ఉన్నా.. న్యూయార్క్‌ సిటీలో అది మరింత తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరికి షెల్టర్ కల్పించాలని న్యూయార్క్ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ‘రైట్ టూ షెల్టర్’ కారణంగానే ఇప్పుడు ఆ రాష్ట్రానికి చిక్కులొచ్చి పడ్డాయి. న్యూయార్క్‌లో ఇళ్లు లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు అధికారులు
ఇప్పటికే నానాతంటాలు పడుతున్నారు. ఈ దశలో అక్రమ వలసదారులు వెల్లువెత్తడం వారికి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.


హోటళ్లు, క్రూయిజ్ షిప్ టెర్మినల్, పోలీసు అకాడమీ పాత భవనం సహా పలు ఇతర ప్రాంతాలు వలసదారుల షెల్టర్లతో కిక్కిరిసిపోయాయి. ఆశ్రయం పొందేందుకు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వందల మంది క్యూలలో పడిగాపులు పడుతున్నారు. వారందరికీ వైద్యం, స్కూలింగ్, ఆహారంతో పాటు ఇతర సర్వీసులనూ రాష్ట్ర ప్రభుత్వాలే అందించాలి. పిల్లలు ఉన్న శరణార్థి కుటుంబాలు షెల్టర్ ప్రాంతానికి చేరుకుంటే రాత్రి 10 గంటల లోపు వారికి కచ్చితంగా ఆశ్రయం కల్పించాలని ‘రైట్ టూ షెల్టర్’ చట్టం చెబుతోంది. అదే పురుషులైతే ఒక రోజులో ఆశ్రయం కల్పించాల్సి ఉంటుంది.

అక్రమ వలసదారులకు సర్వీసులు అందించేందుకు ఒక్క న్యూయార్క్ సిటీయే రానున్న మూడేళ్లలో 1.3 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. తమ మానవతా వైఖరే ఇప్పుడు న్యూయార్క్ నగరాన్ని నాశనం చేస్తోందంటూ మేయర్ ఎరిక్ ఆడమ్స్ వాపోయారు. సిటీ మొత్తం నిండిపోయిందని, కొత్తగా వచ్చే వారికి ఆశ్రయం కల్పించలేమని, సర్వీసులు అందించలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరానికి పోటెత్తిన అక్రమ వలసదారుల్లో 60 వేల మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉంటున్నారు. మిగిలిన సగం మంది ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు.

తాజా సంక్షోభం దరిమిలా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిప్రాయపడ్డారు. సంక్షుభిత పరిస్థితుల్లో 1981 నాటి ఆ చట్టానికి విలువ ఉండదని, తప్పనిసరిగా ఆశ్రయం కల్పించాలన్న నిబంధనను డిస్మిస్ చేయాలని మేయర్ ఆడమ్స్ డిమాండ్ చేస్తున్నారు. టెక్సస్, ఫ్లారిడా తదితర రిపబ్లికన్ రాష్ట్రాల గవర్నర్లు అయితే దగ్గరుండి మరీ వలసదారులను బస్సుల్లో న్యూయార్క్‌కు తరలిస్తుండటం రాజకీయ రంగు పులుముకుంది. తమను ఇరుకున పెట్టడానికే ఇలా చేస్తున్నారని ఉత్తరాదిన ఉన్న డెమొక్రాట్ ప్రభుత్వాలు దుయ్యబడుతున్నాయి.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×