
Miss Universe 2023 : నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ అనే యువతి మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగిన 72వ విశ్వసుందరి పోటీలలో షెన్నిస్ విజేతగా నిలిచింది. మాజీ విశ్వసుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వసుందరి విజేతగా నిలిచిన షెన్నిస్ కు.. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా.. భారత్ నుంచి 23 ఏళ్ల శ్వేతా శార్దా పోటీలో పాల్గొంది. సెమీస్ వరకూ వెళ్లిన శ్వేతా శార్దా విశ్వసుందరి కిరీటాన్ని పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది.
23 ఏళ్ల శ్వేతా శార్దా.. చండీగఢ్ లో జన్మించింది. గతేడాది ముంబైలో జరిగిన మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొని.. 15 మంది అందగత్తెలతో పోటీ పడి ఆ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2021 విజేత దివితా రాయ్ నుంచి మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. 16 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చిన శ్వేతా.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ గ్యాడ్యుయేషన్ డిగ్రీని పూర్తిచేసింది. వృత్తిరీత్యా మోడల్ అయినా.. మంచి డ్యాన్సర్ కూడా. కాగా.. మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో గ్రామీ అవార్డు విజేత జాన్ లెజెండ్ తన సంగీతంతో అందరినీ ఆకర్షించాడు. సుమారు 13 వేల మంది ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించినట్లు తెలిపారు.