Crude Oil Prices: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగినట్లు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న రెండు వారాల విరామం (Ceasefire) నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. యుద్ధం కారణంగా గత కొద్ది రోజులుగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 11 శాతం మేర పడిపోవడం గమనార్హం.
ఈ పరిణామంతో ఇన్వెస్టర్ల ఆందోళనలు తగ్గి, స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లు ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీగా పుంజుకున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతుందేమోనన్న భయంతో అల్లాడిపోతున్న దేశాలకు, ఈ రెండు వారాల విరామం పెద్ద ఉపశమనంగా మారింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 93.76 డాలర్లకు చేరుకోవడంతో సామాన్యుడిపై ఇంధన భారం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణాను పునరుద్ధరించాలని ట్రంప్ విధించిన గడువుకు ఇరాన్ సానుకూలంగా స్పందించడంతో ఈ తాత్కాలిక సంధి కుదిరినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని మధ్యవర్తిత్వం కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ చర్చల ఫలితంగా యుద్ధం నిలిచిపోవడమే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యం తిరిగి గాడిలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన మార్చి నెలలో చమురు ధరలు సుమారు 50 శాతం పెరిగిన నేపథ్యంలో, ఈ తాజా తగ్గింపు రికార్డు స్థాయి పతనంగా రికార్డు సృష్టించింది.
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ నిర్ణయం వల్ల కేవలం చమురు రంగానికే కాకుండా విమానయాన, రవాణా, పెయింట్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు కూడా భారీగా లాభపడే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ భయాలు కూడా ఈ తగ్గిన ధరలతో కొంతమేర అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: వినాశకర యుద్ధం.. వ్యూహం లేని పథకం.. ట్రంప్ వైఖరిపై విరుచుకుపడ్డ మాజీ వైస్ ప్రెసిడెంట్
అయితే, ఈ విరామం కేవలం రెండు వారాల వరకేనని, ఆ తర్వాత ఇరాన్ వైఖరిని బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఏదేమైనా, ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్లలో “రెడ్ జోన్” పోయి “గ్రీన్ జోన్” రావడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. రాబోయే 14 రోజులు మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటే, చమురు ధరలు మరింత దిగివచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత బూస్ట్ లభించే అవకాశం ఉంది.
యుద్ధంపై ట్రంప్ నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్లకు ఊరట
11 శాతం తగ్గిన క్రూడాయిల్ ధరలు
93.76 డాలర్లకు చేరిన బ్యారెల్ క్రూడాయిల్ ధర
ఇరాన్‌పై చేస్తోన్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే
ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పడిపోగా..… https://t.co/ywkRBprRju pic.twitter.com/mNXYmYeOzZ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2026