Pakistan: మొన్నటి వరకు శ్రీలంక.. నేడు పాకిస్థాన్. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం అల్లాడిపోతోంది. ఆకలి కేకలు.. కరెంటు కోతలు.. ఇంధన కొరతతో పాకిస్థాన్ మరో శ్రీలంకను తలపిస్తోంది. ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఇతర దేశాల్లో ఉన్న తమ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ఇక దేశంలో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడి పెట్రోల్ బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి నిల్వలు ఉన్న బంకుల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. పంజాబ్, లాహోర్, గుజ్రన్‌వాలా, ఫైసలాబాద్ వంటి నగరాల్లో నెలకుపైగా సరఫరా నిలిచిపోయింది.