Pakistan UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council – UNSC) భారత్‌కు షాకిచ్చింది. దాయాది దేశం పాకిస్తాన్ కు ఐరాస అనూహ్యంగా యుఎన్ఎస్‌సిలో సీటు కేటాయించింది. భద్రతా మండలి తాత్కాలిక సీటు కలిగిన జపాన్ గడువు ముగిసిపోవడంతో ఆ స్థానాన్ని పాకిస్తాన్ కు కేటాయించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతం నుంచి భద్రతా మండలిలో కేవలం రెండు దేశాలకే స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం జపాన్ స్థానంలో పాకిస్తాన్ కు చోటు దక్కగా.. మరో దేశం దక్షిణ కొరియా. పాకిస్తాన్‌కు రెండేళ్ల పాటు మాత్రమే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించింది.
పైగా పాకిస్తాన్‌కు భద్రతా మండలి కార్యనిర్వహణ బాధ్యతలు కూడా జూలై 2025 నుంచి దక్కుతాయి. దీంతో ఐరాస భద్రతా మండలి ఎజెండాను పాకిస్తాన్ నిర్ణయిస్తుంది. ఈ పవర్స్‌తో పాకిస్తాన్‌కు ప్రపంచంలోని ఏదైనా ఉగ్రవాదుల గ్రూపులు, సమూహాలు వారికి సాయం చేసే సంస్థలను నిషేధించే అధికారులుంటాయి. ఇప్పటికే అల్ కాయిదా, ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే కమిటీలో పాకిస్తాన్ సభ్య దేశంగా ఉంది.
అయితే భద్రతా మండలి తాత్కాలికంగా రెండేళ్ల పాటు పాకిస్తాన్ కు సభ్యత్వం లభించడం కొత్తేమీ కాదు. ఇలా పాకిస్తాన్ కు చోటు దక్కడం ఇది ఎనిమిదో సారి. కానీ ప్రస్తుతం మధ్య, పశ్చిమ ఆసియా దేశాలు.. అంటే గాజా, లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, సిరియా, అర్మేనియా, అజెర్‌బైజాన్‌లలో రాజకీయ, మానవీయ సంక్షోభం నెలకొంది.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
వీటికి తోడు రష్య, ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధం వల్ల యురోప్ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇది చాలదన్నట్లు చైనా, తైవాన్‌ల మధ్య, నార్త్ కొరియా, సౌత కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఫిలిప్పీన్స్, వియత్నం దేశాలను కూడా చైనా తన నావికా దళంతో భయపెడుతోంది. అన్నింటి కంటే ఎక్కువగా దక్షిణ కొరియాలో ఇద్దరు అధ్యక్షులు అభిశంసనకు గురయ్యారు. ప్రపంచ దేశాల్లో ఇంతటి సంక్షోభం ఉన్న తరుణంలో పాకిస్తాన్ కు భద్రతా మండలిలో సభ్యత్వం లభించింది. దీంతో పాకిస్తాన్‌కు భద్రతా మండలి తరపున ఈ అంశాలపై నిర్ణయం తీసుకోవడం కత్తి మీద సాము లాగే ఉంటుంది.
అయితే పాకిస్తాన్ ఈ అంశాలను కాకుండా కశ్మీర్ అంశం పైనే దృష్టి సారిస్తుందని జియో పాలిటిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐరాస్ లోని పాకిస్తాన్ రాయబారి సూచనలు చేశారు. “అంతర్జాతీయ వేదికపై మేము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతాం, ఐరాస కఠిన చర్యలు తీసుకునే విధంగా పూర్తి కృషి చేస్తాం” అని పాకిస్తాన్ ఐరాస అంబాసెడర్ మునీర్ అక్రమ్ ఇటీవలే ప్రకటించారు.
భద్రతా మండలిలో (UN Security council) పాకిస్తాన్ ను ఇది తాత్కాలిక సభ్యత్వం మాత్రమే కావడంతో వీటో హక్కులు ఉండవు. కానీ ఉగ్రవాదులు, ఇతర కంపెనీలు, సంస్థలపై ఆంక్షలు విధించే అధికారాలు దక్కుతాయి. అయతే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని చాలా దేశాలు సమర్థిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఈ విషయంలో అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమైన ఇండియా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కీలక సంస్కర్ణలు చేసిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ క్రమంలో ఇండియాకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని వాదించే దేశాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కానీ భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్ మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెంచకూడదని చాలా కాలంగా వాదిస్తోంది. ఇది పరోక్షంగా భారత్ ను చూసి అసూయ పడడమే అవుతుంది.