Hasina Govt: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై రాజుకున్న నిప్పు చినికి చినికి కార్చిచ్చులా మారుతున్నది. ప్రభుత్వానికే ముప్పుగా పరిణమిస్తున్నది. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం మాత్రం వారంతా విద్యార్థులు కాదని, ప్రతిపక్షాల కుట్రే ఇదంతా అని చెబుతున్నది. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది చేస్తున్న ఆందోళనలను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం శాయాశక్తుల పని చేస్తున్నది. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లనూ ప్రయోగించింది. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 91 మంది మరణించారు. కొన్ని వందల మంది ఆందోళనకారులు గాయాలపాలయ్యారు.
పరిస్థితులు అదుపులోకి రాకపోయే సరికి ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించింది. హైస్పీడ్ ఇంటర్నెట్‌ను నిలిపేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
1971నాటి బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కోర్టు ఈ రిజర్వేషన్‌ను 5 శాతానికి కుదించింది. అందులో మూడు శాతం స్వాతంత్ర్య సమరయోధుల బంధువులకు వర్తిస్తుందని తీర్పు ఇచ్చింది. అయినా.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంతకు ముందు ఆందోళనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ అణచివేతలో కనీసం 200 మంది వరకు ఆందోళనకారులు దుర్మరణం చెందారు. అలాగే.. కొన్ని వందలాది మంది విద్యార్థులు, ఆందోళనకారులను జైలుకు పంపించారు. ప్రభుత్వం వ్యవహరించిన ఈ తీరును నిరసిస్తున్నారు. వెంటనే అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ప్లీజ్ బెయిల్ ఇవ్వండి.. పిన్నెల్లి రిక్వెస్ట్
ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలని ప్రధానమంత్రి షేక్ హసీనా అధికారులను ఆదేశించిందని ఆవామీ లీగ్ తెలిపింది. అలాగే… అమాయకులు, గతంలో మర్డర్, విధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో కేసులు లేని వారిని కూడా విడుదల చేయాలని హోం మంత్రిని ఆదేశించినట్టు పేర్కొంది. అయినా.. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించడంతో జులైలో విద్యార్థులు రోడ్డెక్కారు. అప్పుడు ఆ ఆందోళన రాజధాని ఢాకా నగరానికే పరిమితమైంది. కానీ, ప్రభుత్వం వారిపై కఠినంగా వ్యవహరించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఆందోళనలు ఉధృతరూపంలో జరుగుతున్నాయి. ఢాకా సహా ఇతర ప్రాంతాలకూ ఆందోళనలు పాకాయి. ఎక్కడ చూసినా దారి దిగ్బంధనం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, కర్రలు పట్టుకుని ఆందోళనకారులు ఉగ్రరూపం దాల్చారు. పోలీసులు, అధికార ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజలు ప్రభుత్వానికి సహకరించొద్దని, పన్నులు, ఇతర బిల్లులు చెల్లించొద్దని, ఆదివారం(ఆ దేశంలో ఆదివారం వర్కింగ్ డే) ఉద్యోగానికీ వెళ్లొద్దని పిలుపు ఇచ్చింది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా నాలుగో సారి ఎన్నికయ్యారు. 15 ఏళ్లు పరిపాలించిన ఆమె మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఎన్నికయ్యారు. తాజా ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ముప్పులోనే ఉన్నదని చెబుతున్నారు.