Pope Francis: వాటికన్ సిటీ కాథలిక్ చర్చ్ అధిపతి, పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్.. ఈస్టర్ మరుసటిరోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుండి పోప్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు.
పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో. 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 23 వరకు, పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లోని జెమెల్లి హాస్పిటల్‌లో 38 రోజుల పాటు చికిత్స పొందారు. ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు.
పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరనేదన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. కార్డినల్స్ సభ కాన్‌క్లేవ్ అనే రహస్య సమావేశంలో కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు. ఎన్నికకు అర్హులైన కార్డినల్స్ సంఖ్య సాధారణంగా 120 మంది వరకు ఉంటుంది. వాళ్లు 80 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారై ఉండాలి. ఎన్నికకు టు బై థర్డ్ మెజారిటీ అవసరం పడుతుంది.
గత కొంత కాలంగా శ్వాసకోశ, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను రోమ్ లోని జెమెల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పోప్ తుదిశ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు తెలిపారు.
2021 జూలైలో పెద్దపేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం.. ఆస్పత్రిలో చేరిన పోప్.. ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో పోప్ బ్రాంకైటిస్ హాస్పిటల్ లో చేరారు. పోప్ ఆరోగ్యం మెరుగుపడినప్పటికి.. శ్వాశకోశ వ్యాధితో ఇంకా బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. వయస్సు, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా.. ఆయన సేవ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగారని చెప్పవచ్చు.
Also Read: కెనడాలో రెండు వర్గాల మధ్య కాల్పులు.. భారతీయ యువతి మృతి
వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పేదల పట్ల నిబద్ధతతో పాటు కాథలిక్ చర్చిని సంరక్షించడానికి.. చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావు. మతపరమైన సంప్రదాయాలు, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు పోప్.
వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారినవర్గాలకు ప్రతి ఒక్కరికీ.. సమానంగా చోటు కల్పించాలనే తపనతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణతో పాటు, అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం చాలా మందికి మార్గదర్శకంగా నిలిచింది. దీంతోపాటు చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పోప్ ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు.