Sri Lanka Elections: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె కు చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) ఘన విజయం సాధించింది. శుక్రవారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 225 సీట్లకు గాను ఎన్‌పిపి కి 132 సీట్లు దక్కాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓట్ల కౌంటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. ఎన్‌పిపికి సీట్లు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
కొన్ని రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సాజిత్ ప్రేమదాస నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి (సమాజి జన బలవెగయ)కు కేవలం 18 శాతం ఓట్లు దక్కగా.. అధ్యక్షుడు దిస్సనాయకె కు చెందిన ఎన్‌పిపి.. 62 శాతానికి పైగా ఓట్లు సాధించి విజేతగా నిలిచింది. ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు. అయితే సెప్టెంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం మంది ఓటు వేయగా.. ఈ సారి 70 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: కరిగిపోయిన ట్రంప్ ఆస్తి.. ఒక్కరోజులో 300 మిలియన్ డాలర్లు నష్టం!
మాజీ ఎంపీ, మార్క్సిస్ట్ లీడర్ అయిన దిస్సనాయకె శ్రీలంకలో అవినీతిని అంతం చేస్తానని, దోపిడికీ గురైన ప్రభుత్వ నిధులను తిరిగి తీసుకు వస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గత రెండేళ్లుగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ ప్రజలకు సరిపడ ఆహారం, వైద్య సదుపాయాలు కూడా కరువయ్యాయి. దేశంలో సంక్షోభ పరిస్థితులతో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో దేశ సంపదను దోచుకొని 2022లో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశ విడిచి పారిపోయాడు.
2022లో ఎన్‌పిపి పార్లమెంటులో మిగతా పార్టీలతో పోలిస్తే.. చాలా చిన్న స్థాయిలో ఉండేది. అయితే ప్రస్తుతం మార్పు కోరుకుంటున్న ప్రజలు మతవాదాన్ని వీడి లెఫ్టిస్టు భావజాలమున్న దిస్సనాయకె కు అధికారం కట్టబెట్టారు. శ్రీలంకలో తమిళ జనాభా ఉన్న ఉత్తర జాఫ్నా లో కూడా దిస్సనాయకె పార్టీకి ప్రజలు జై కొట్టారు. శ్రీలంకు స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి జాఫ్నాలో ఒక సింహళ నాయకుడి పార్టీ విజయం సాధించడం ఇదే తొలిసారి.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను (Sri Lanka) గాడిలో పెట్టేందుకు దిస్సనాయకె తన మార్క్సిస్టు భావజాలాన్ని పక్కన బెట్టి.. లిబరల్ విధానాలను అనుసరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించగానే ఆయన ఇంటర్నేషన్నల్ మానిటర్ ఫండ్ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు నుంచి 2.9 బిలియన్ డాలర్ల అప్పుకోసం చర్చలు జరిపారు. అయితే ఆ అప్పు పుట్టాలంటే ప్రజలు, కంపెనీలపై ఎక్కువ పన్నులు వేయాలని ఐఎంఎప్ షరతులు విధించింది. ముందే కష్టాల్లో ఉన్న ప్రజలపై అధిక పన్నులు వేయడం ఇష్టంలేని దిస్సనాయకె ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
దిస్సనాయకె నిర్ణయాలతో శ్రీలంక స్టాక్ మార్కెట్ 16 శాతం అభివృద్ధి సాధించింది. ఆయనకు కార్పొరేట్ కంపెనీలు కూడా మద్దతు తెలిపాయి. ప్రతిపక్షాలు కూడా బలహీనంగా ఉండడంతో దిస్సనాయకె (Dissanayake) దేశాన్ని గాడిలో పెట్టేందుకు తీసుకునే నిర్ణయాలకు అడ్డులేకుండా పోయింది. దీంతో శ్రీలంకలో ఇప్పుడు దిస్సనాయకె తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.