
Reykjavik : ఐరోపాకు చెందిన ద్వీపదేశమైన ఐస్ లాండ్.. వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. రాజధాని రెక్జావిక్ ప్రాంతంలో ప్రకంపనలు రాగా.. ఐస్ లాండ్ అత్యవసర పరిస్థిని ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం రెక్జావిక్ కు 40 కిలోమీటర్ల దూరంలో 2 బలమైన ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైంది. ఆ ద్వీపంలో సంభవించే ప్రకంపనల్లో ఇదే అత్యధికమైన తీవ్రతను కలిగి ఉంది.
ప్రకంపనల కారణంగా రెక్జానెస్ సమీప ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలను నిలిపివేశారు. అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో 24వేల ప్రకంపనలు సంభవించగా.. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ సుమారు 800 ప్రకంపనలు నమోదయ్యాయి. తీవ్రమైన భూకంపాల కారణంగా ప్రజల రక్షణార్థం ఎమర్జెన్సీని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని, అగ్నిపర్వతాల విస్ఫోటాలకు దారితీయొచ్చని హెచ్చరించారు. ప్రకంపనలు వచ్చిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్ అనే జనావాస ప్రాంతం ఉంది. ఇక్కడ 4 వేల మంది నివసిస్తుండగా.. వారిని పునారావాసాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.