Russian Lieutenant: రష్యా మిలిటరీలో అత్యున్నత శిక్షణ పొందిన ఒక యువ సైనికాధికారి ఉక్రెయిన్ యుద్దంలో సొంత దేశానికే తీరని ద్రోహం చేశాడు. ఉక్రెయిన్ బలగాలకు రష్యా యుద్ధ ప్రణాళికలు, సైనిక కదలికల సమాచారాన్ని అందిస్తూ సుమారు 300 మంది రష్యన్ సైనికుల మరణానికి కారణమయ్యాడు. 26 ఏళ్ల లెఫ్టినెంట్ లెవ్ స్టూప్నికోవ్ (Lt. Lev Stupnikov) ఈ దేశద్రోహానికి పాల్పడినట్లు రష్యా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతడు.. సరిహద్దు దాటి ఉక్రెయిన్ వైపు చేరినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైన్యంలో అతడు భాగమైనట్లు తెలుస్తోంది.
బుద్యోన్నీ మిలిటరీ అకాడమీ ఆఫ్ ది సిగ్నల్ కార్ప్స్ (Budyonny Military Academy of the Signal Corps)లో పట్టభద్రుడైన స్టూప్నికోవ్.. డాన్బాస్ రీజియన్ (Donbas region)లోని బెటాలియన్కు చీఫ్ సిగ్నల్స్ ఆఫీసర్గా నియమితుడయ్యాడు. సైనిక కమాండర్లకు.. డ్రోన్లు, నిఘా కెమెరాల సమాచారాన్ని నిరంతరం అందించే బాధ్యతను అతడికి అప్పగించారు. అయితే స్టూప్నికోవ్ ఆ సమాచారాన్ని తన ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు రహస్యంగా చేరవేయడం ప్రారంభించాడు.
ఓ రోజు స్టూప్నికోవ్ కడుపునొప్పితో బాధపడుతున్నట్లు నటించి సైనికులకు దూరంగా వెళ్లాడు. ఆ వెంటనే అతడు పంపిన నిర్దిష్ట సమాచారం (కోఆర్డినేట్స్) ఆధారంగా ఉక్రెయిన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడిలో కల్నల్ గుసేన్ ముసాయెవ్తో సహా 68 మంది రష్యన్ సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఉక్రెయిన్ ప్రతినిధి ‘పేలుళ్లు జరిగాయా? ఫోటో పంపు’ అని మెసేజ్ చేయగా.. ‘అక్కడ అంతా మాంసం ముక్కలే మిగిలాయి’ అని స్టూప్నికోవ్ బదులిచ్చాడు. మెుత్తంగా పలు సందర్భాల్లో ఉక్రెయిన్ నిఘా వ్యవస్థకు సమాచారం ఇచ్చి దాదాపు 300 మంది రష్యన్ సైనికుల మరణానికి స్టూప్నికోవ్ కారణమైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి తెగబడగా.. అప్పటి దృశ్యాలు స్టూప్నికోవ్ను తీవ్రంగా కలిచివేసినట్లు తెలుస్తోంది. అమాయక ఉక్రెయిన్ పౌరులపై రష్యన్ వైమానిక దళం బాంబులు వేయడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతని తల్లి తత్యానా యాన్ట్సేన్ కూడా పుతిన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం ప్రారంభించింది. దీంతో స్టూప్నికోవ్ లో ఉక్రెయిన్ పై సానుకూల భావం ఏర్పడింది. దీంతో రష్యన్ సైనికుల వ్యూహాలు, కదలికలను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ కు చేరవేస్తూ ఆ దేశానికి ఏజెంట్ గా మారాడు. సొంత దేశంపైనే స్టూప్నికోవ్ రహస్య ఆపరేషన్ నిర్వహించాడు. తనపై తోటి సైనికులకు అనుమానం మెుదలైందని తెలియడంతో.. గుట్టుచప్పుడు కాకుండా ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సహకారంతో సరిహద్దు దాటేశాడు. అలా ప్రస్తుతం ఉక్రెయిన్ సైనికుల తరపున రష్యా పైనే యుద్ధ భూమిలో స్టూప్నికోవ్ తలపడుతున్నాడు.
Also Read: యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!