Suicide Bomb Attack in Mogadishu:ఈస్ట్ ఆసియా దేశమైన సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 32 మంది మరణించారు. నిత్యం రద్దీగా ఉండే లీడో బీచ్ వద్ద అల్ – షబాబ్ అనే సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడి చేశాడు. మరికొందరు ముష్కరుల కాల్పుల్లో మరణించారు. ఈ ఘటనలో మరో 63 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ దాడికి పాల్పడిన వారిలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్పులు జరిపి చంపారు. ఒకరిని పట్టుకుని జైలుకు తరలించారు. కాగా.. ఈ దాడికి కారణం తామేనని అల్ ఖైదా అనుబంధ సంస్థ ప్రకటించింది. 17సంవత్సరాలుగా అంతర్జాతీయ మద్దతుతో ఉన్న ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు తిరుగుబాటు చేస్తున్నారు.
ఆత్మాహుతి దాడితో బీచ్ వద్ద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేలుడు జరిగిన వెంటనే ముష్కరులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదని ప్రత్యక్ష సాక్షి అబ్ధుల్ లతీఫ్ అలీ మీడియాకు తెలిపాడు. సమీపంలోని హోటల్ నుంచి ఈ ఘటనను చూసిన తాను.. చాలామంది తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడారని, ఆ ప్రాంతమంతా భయానకంగా మారిందన్నాడు. కాగా.. గత నెలలో రాజధానిలోని ఓ కేఫ్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు చనిపోయారు.