Israel Truck attack| ఒకవైపు గాజాలో హమాస్‌తో, మరోవైపు లెబనాన్‌లో హిజ్బుల్లాతో యుద్దం చేస్తున్న ఇజ్రాయెల్ లో తాజాగా ఒక ట్రక్కు దాడి జరిగింది. ఆదివారం అక్టోబర్ 28, 2024న సాయంత్రం రాజధాని టెల్ అవీవ్ లో ఒక బస్ స్టాప్ కు సమీపంగా ఒక పెద్ద ట్రక్కు దూసుకొని వచ్చింది. ఈ ఘటనలో 35 మంది తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ పోలీసుల ప్రకారం.. ఆ ట్రక్కు డ్రైవర్ ఇజ్రాయెల్ పౌరుడే అయినా.. అతను అరబ్బు జాతికి చెందినవాడు. ఈ ట్రక్కు దాడి జరిగిన ప్రాంతంలోనే ఇజ్రాయెల్ గూడాఛార ఏజెన్సీ అయిన మొసాద్ ముఖ్య కార్యాలయం ఉండడం గమనార్హం.
ఇజ్రాయెల్ స్థానిక మీడియా ప్రకారం.. రాజధాని టెల్ అవీవ్‌కు ఈశాన్యం వైపున ఉన్న రమాత్ హషరోన్ అనే ప్రాంతంలో వారం రోజుల సెలవుల తరువాత ఇజ్రాయెల్ పౌరులు ఉద్యోగాలకు వెళుతుండగా.. ఒక ట్రక్కు అనూహ్యంగా దూసుకువచ్చింది. ఆ ట్రక్కు అక్కడ నిలబడి ఉన్న కార్లను గుద్దుకుంటూ వచ్చి బస్ట్ స్టాప్ వద్దకు దూసుకొని వచ్చింది. దీంతో కార్లు బోల్లా కొట్టాయి. కార్లలో ఉన్న వ్యక్తులు లోపల ఇరుక్కుపోయారు. ఆ బస్ స్టాప్ కు సమీపంలోనే సెంట్రల్ హైవే జంక్షన్, మొసాద్ హెడ్ క్వార్టర్స్, ఒక మిలిటరీ బేస్ ఉండడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read: యుద్ధం ముగించడానికి హమాస్ రెడీ.. ‘గాజాలో ఇజ్రాయెల్ దాడులు అపేస్తే..’
ఘటనా స్థలానికి సహాయక దళమైన మాజెన్ డేవిడ్ ఆడోమ్ సర్వీస్ అక్కడికి వెంటనే చేరుకొని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచింది. మొత్తం 35 మంది ఈ ఘటనలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ పోలీస్ ప్రతినిధి అయిన అసి అహరోనీ మీడియాతో మాట్లాడుతూ… “దాడిని చేసిన వ్యక్తని అదుపులోకి తీసుకున్నాం. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది.” అని తెలిపారు.
ఈ దాడి హమాస్, ఇతర ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపు చేసినట్లు ఇంతవరకు స్పష్టత లేదు. గత కొన్ని సంవత్సరాలుగా టెల్ అవీవ్ లో నివసిస్తున్న పాలస్తీనావాసులు కత్తి దాడులు, తుపాకీ దాడులు, కార్ల దాడులకు పాల్పడిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత సంవత్సరం అక్టోబర్ లో హమాస్ దాడి తరువాత ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ముఖ్యంగా గాజాల, వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల కారణంగా వందల మంది చనిపోయారు. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ పౌరులపై దాడులు చేస్తున్నారు. హింసాత్మక నిరసనలు చేస్తున్నారు.
టెల్ అవీవ్ బస్సు దాడి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వెస్ట్ బ్యాంక్ లోని చెక్ పాయింట్ వద్ద ఇజ్రాయెల్ సైనికులపై ఒక కారు దూసుకువచ్చింది. ఆ కారు నడిపే వ్యక్తి ఘటన తరువాత వెంటనే కారు దిగి సైనికులపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ సైనికులు అతడిని కాల్చి చంపారు.
మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో ఇరాన్ తిరిగి దాడి చేస్తే.. ఇక రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.