BigTV English

Population: దక్షిణాదికి జన బలం కావాల్సిందేనా?

Population: దక్షిణాదికి జన బలం కావాల్సిందేనా?

Population: ఒకప్పుడు ఒకరిద్దరు ముద్దు.. ముగ్గురు అసలే వద్దూ అంటూ జనాభా నియంత్రణపై ప్రభుత్వాలే ప్రచారం చేశాయి. అయితే, ఇప్పుడు కాలం మారింది. జనాభా నియంత్రణ చేయనే చేయొద్దు. ముగ్గురు పిల్లలు.. అంతకుమించి అయితేనే ముద్దు అంటున్నారు. ఒకరిద్దరు వద్దే వద్దని సలహాలిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ పిలుపునిస్తున్నారు. లేకపోతే, భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటుని, భారతదేశంలో దక్షిణాది రాష్ట్రలా ఉనికి సన్నగిల్లుతుందని చెబుతున్నారు. ఈ నేతలు పిల్లలపై చేసిన వ్యాఖ్యలతో.. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్లాన్, దాని ప్రభావం జనాభా తగ్గుతున్న దక్షిణాది రాష్ట్రాలపై ఎలా ఉండబోతుందనే చర్చను మరోసారి తీసుకొచ్చింది.


ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు

దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతున్న వైనంపై ఇటీవల  సీఎం చంద్రబాబు  ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఏపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించడం, దంపతులకు ఎక్కువ మంది పిల్లలు పుట్టేలా ప్రోత్సహించే కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించే పాత చట్టాన్ని రద్దు చేసినట్లు కూడా చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు స్పష్టం అయ్యింది. ఇప్పటికే గతంలో ఉన్న ఇద్దరు పిల్లల చట్టాన్ని ఆగస్టు 7న రాష్ట్ర కేబినెట్ రద్దు చేసింది.ఈ నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనేక జిల్లాల్లో యువత ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారని చంద్రబాబు తాజాగా వెల్లడించారు.


వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. అలాగే దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలున్నాయి. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి. అందుకే, ఇటీవల కాలంలో కేంద్రం ఇచ్చే వాటలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయనే వాదన ఉంది.

2050 నాటికి, ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వారే

భారతదేశంలో వృద్ధాప్య జనాభా పెరగరడం, సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడాన్ని ఇటీవలి డేటా స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం, 2050 నాటికి, ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లు పైబడి ఉంటారని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సంవత్సరాలుగా, దక్షిణాది రాష్ట్రాలు వారి మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతున్నట్లు గమనించాయి. ఇది సాధారణ స్థాయి కంటే మరింత దిగువకు పడిపోవడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. NFHS-5 ప్రకారం సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2.0 కాగా, తెలంగాణలో అది 1.8 గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో అది 1.7గా ఉంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.6 వద్ద జాతీయ సగటు 2 కంటే కొంచెం తక్కువగా ఉంది. సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుందని ముంబయ్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ చెబుతోంది.

Also Read:  గృహహింస చట్టానికి తూట్లు..

2021, 2036 మధ్య భారతదేశ జనాభాలో వృద్ధుల నిష్పత్తి..

ఇక, ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం, 2021, 2036 మధ్య భారతదేశ జనాభాలో వృద్ధుల నిష్పత్తి ఉత్తరాదిలో 3 నుండి 4%తో పోలిస్తే దక్షిణాదిలో 6 నుండి 7% పెరుగుతుంది. దక్షిణాదిలో ఆయుర్దాయం కూడా ఎక్కువగానే ఉంది. అయితే, ఉత్తరాది రాష్ట్రాల కంటే చాలా ముందుగానే దక్షిణాది రాష్ట్రాలు తక్కువ సంతానోత్పత్తి రేటు పెరిగింది. గణాంకాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ 2025లో ఈ సంతానోత్పత్తి స్థాయిని చేరడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ తర్వాత 20 సంవత్సరాల కంటే ఎక్కువనే చెప్పాలి. అందుకే, ఉత్తరాదికి ముందే జనాభా తగ్గుతున్న దక్షిణాది రాష్ట్రాలు దీనికి మూల్యం చెల్లించుకుంటాయనే భయాలు ఉన్నాయి.

ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన

ఇక, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. దీనితో, దక్షిణాది రాష్ట్రాల్లో నియోజవర్గాలు తగ్గుతాయనే ఆందోళన పెరిగింది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా, దక్షిణాదితో పోలిస్తే ఎక్కువ లోక్‌సభ స్థానాలు, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు వెళతాయి. అది ఉత్తరాదికి రాజకీయ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇక, కొత్త జన గణన తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ, లోక్‌సభ నియోజకవర్గాలు తక్కువగా ఉండటం వల్ల జాతీయ నిర్ణయాధికారంలో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం తగ్గిపోతుందనే భయం బలంగా ఉంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ వ్యాఖ్యలకు కర్ణాటక, తెలంగాణ, కేరళల నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఇవి ఇప్పటికే పార్లమెంటులో.. కేంద్ర నిధుల పంపిణీలో జనాభా సంఖ్యల ఆధారంగా ఇచ్చే పక్షపాత ధోరణిని విమర్శిస్తున్నాయి. అందుకే, జనాభాను పెంచే లక్ష్యంతో దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్థికంగా బలమైన దక్షిణాదికి అధికార వికేంద్రీకరణలో తక్కువ వాటా

15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన స్థాయిలతో పోల్చితే గత కొన్నేళ్లుగా రాష్ట్రాలకు ఇచ్చిన డెవల్యూషన్ చాలా తక్కువగా ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అలాగే, తక్కువ జనాభా, ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలకు అధికార వికేంద్రీకరణలో వాటా తక్కువగా ఉంటుంది. అయితే, ఈ కొలమానాల్లో బలహీనంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో ఎక్కువ వాటాను పొందుతాయి. నిజానికి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న19.6% జనాభా నుండి దేశానికి 30% కంటే ఎక్కువ GDPతో గణనీయమైన సహకారం అందిస్తున్నారు. అయినా, దక్షిణాది రాష్ట్రాలు 11వ ఆర్థిక సంఘం కింద 21% వాటా కేటాయిస్తే… అది, 15వ ఆర్థిక సంఘం కింద కేవలం 15.8%కి పన్ను పంపిణీలో తమ వాటాను తగ్గించాయి. ఇది, 2011 జనాభా లెక్కల ఆధారంగా జరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు సెంట్రల్ పూల్‌లో తమ ఆదాయ వాటాను కోల్పోయాయి. దీనికి తోడు ఇప్పుడు, దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభా ఎక్కువయ్యింది. ఇది వారికి పెన్షన్ అందించే భారాన్ని పెంచుతుంది. కాబట్టి, లోక్‌సభ స్థానాల విభజనపై ఉన్న సందేహాలను కేంద్రం పరిష్కరించి, దక్షిణ భారత రాష్ట్రాల ఆందోళనలను నివృత్తి చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×