Trump Gaza Netanyahu | గాజాను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకా, అక్కడి పాలస్తీనా వాసులను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనను అనేక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, సౌదీ అరేబియా మరియు జోర్డాన్ వంటి మిత్ర దేశాలు కూడా దీనిని వ్యతిరేకించాయి. దీని కారణంగా, అమెరికా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ట్రంప్ వ్యాఖ్యలపై శ్వేతసౌధ ప్రతినిధి కారోలైన్ లెవెట్టి స్పందించారు. పాలస్తీనా వాసులను తాత్కాలికంగా మాత్రమే ఇతర ప్రాంతాలకు మారుస్తామని స్పష్టం చేశారు. “ట్రంప్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. పాలస్తీనా శరణార్థులకు ఈజిప్ట్ మరియు జోర్డాన్ వంటి మిత్ర దేశాలు ఆశ్రయం ఇస్తాయని మేము ఆశిస్తున్నాము. అప్పుడే వారి ఇళ్లను పునర్నిర్మించగలం. ప్రస్తుతం గాజా ప్రాంతం శిథిల భవనాలతో నిండిపోయి, నివాసయోగ్యం కాదు. అలాంటి పరిస్థితిలో వారిని అక్కడే ఉండమనడం సరైనది కాదు. అమెరికా దళాలు గాజాకు వెళ్లడానికి ట్రంప్ ఎటువంటి అడ్డంకులు లేవని కూడా స్పష్టం చేశారు. గాజా పునర్నిర్మాణంలో అమెరికా పాత్ర కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. అయితే, ఇది అమెరికా ప్రజల సొమ్మును పెట్టుబడిగా పెట్టడం కాదు. ట్రంప్ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ డీల్ మేకర్. ఈ ప్రాంతంలోని మా భాగస్వాములతో ఆయన ఒక ఒప్పందం చేసుకుంటారు” అని ఆమె వివరించారు. అలాగే, బందీలను విడిపించడానికి అమెరికా కట్టుబడి ఉందని కూడా ఆమె పునరుద్ఘాటించారు. గాజా నియంత్రణ మళ్లీ హమాస్ చేతికి వెళ్లకుండా చూస్తామని కూడా స్పష్టం చేశారు.
గాజా పరిస్థితిపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ట్రంప్‌తో కలిశారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరూ శ్వేతసౌధంలో సంయుక్తంగా మీడియాకు ప్రకటన చేశారు. గాజాలో ఉన్న 20 లక్షల పాలస్తీనా వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే, గాజా ప్రాంతానికి అమెరికా బాధ్యత తీసుకుంటుందని మరియు దాన్ని పునర్నిర్మిస్తుందని ట్రంప్ తెలిపారు.
Also Read: నన్ను చంపాలనుకుంటే సర్వనాశనం అయిపోతారు.. ఇరాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్
ట్రంప్ ఉద్దేశంలో తప్పేముంది?: నెతన్యాహు
పాలస్తీనీయుల విషయంలో ట్రంప్ చేసిన ప్రతిపాదనపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. అరబ్ దేశాలతో పాటు అమెరికా మిత్ర దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, కెనెడా లాంటి పాశ్చాత్య దేశాలు కూడా ట్రంప్ తీరును వ్యతిరేకించాయి. అలా చేస్తే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది. అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌కు మద్దతు తెలిపారు. “ట్రంప్ ఆలోచనలో తప్పేమీ లేదు. గాజాలోని పాలస్తీనా వాసులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు లేదా అక్కడే ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఏదేమైనా గాజాను పునర్నిర్మించాలి అదే ఉద్దేశం” అని నెతన్యాహు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
“హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా దళాలను గాజాకు పంపడం, ఆ ప్రాంత పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడాన్ని నేను నమ్మలేకపోయాను” అని నెతన్యాహు అన్నారు. ఇంతలో, గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.