Trump on IND PAK : ఉగ్రవాదుల్ని పెంచిపోషిస్తూ, ఇతర దేశాలపై దాడులకు ఉసిగొల్పుతున్న ఉగ్రదేశం పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేశంలోని ఓ కరుడుగట్టిన ఉగ్రవాదిని అప్పగించినందుకు ఆయన ఈ ప్రకటన చేశారు. మూడున్నరేళ్ల క్రితం అమెరికా దళాలపై దాడి చేసి.. వారి సైనికుల్ని చంపేసిన కిరాతక దాడిలో ప్రధాన నిందితుడైన ఇస్లాం ఉగ్రవాదిని.. అమెరికాకు అప్పగించారని, అందుకు తాను ప్రత్యేక ధన్యావాదులు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అమెరికాకు నష్టం కలిగించే దేశాలపై కఠినంగా ఉండే ట్రంప్.. పాక్ వంటి దుర్మార్గపు దేశానికి కృతజ్ఞతలు చెప్పడాన్ని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు తప్పుపడుతున్నారు.
దాదాపు 20 ఏళ్ల పాటు అఫ్ఘనిస్తాన్ ని సైనిక అదుపులో ఉంచుకున్న అమెరికా.. ఆగస్టు 2021లో అక్కడి నుంచి తన దళాల్ని ఉపసంహరించుకుంది. ట్రంప్ తొలి దశ పాలనలో ఈ పరిణామం చోటుచేసుకోగా.. హడావిడిగా అమెరికా సేనలు అఫ్ఘాన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాయి. ఆ సమయంలో అమెరికా సేనలపై బాంబు దాడులు జరగగా.. ఆ దాడిలో 13 మంది అమెరికన్ సర్వీస్ సభ్యులు, దాదాపు 170 మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ప్రధాన సూత్రధారిని పట్టుకోవడంలో పాకిస్తాన్ సాయం చేసిందని తెలిపిన ట్రంప్.. పాక్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన డోనాల్ట్ ట్రంప్.. ఇస్లామిక్ టెర్రరిస్టుల దాడిలో కొంత మంది సైనికుల్ని కోల్పోయామని, వారి మరణానికి కారణమైన ఉగ్రవాదిని పట్టుకున్నట్లు ప్రకటిస్తున్నా అంటూ తెలిపారు. ఆ ఉగ్రవాది ఇప్పుడు అమెరికన్ న్యాయం వ్యవస్థ విధించే శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడని వెల్లడించారు. నిందితుడి అరెస్టు ప్రకటన తర్వాత, ట్రంప్ ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ పాత్రను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ రాక్షసుడిని అరెస్టు చేయడంలో సహాయం చేసినందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అమరులైన సైనికుల కుటుంబాలకు ఇది సంతోషాన్ని కలిగించే రోజు అన్నారు. బాంబు దాడి తర్వాత సైనికుల కుటుంబాలు ఎదుర్కొన్న బాధ, వారి పిల్లలు అనుభవిస్తున్న కష్టాలు, మానసిక ఆవేదన తనకు బాగా తెలుసన్నారు.
అలాగే.. ఒక ముఖ్యమైన విధాన మార్పును ట్రంప్ తీసుకున్నారు. పాకిస్థాన్ దగ్గర ఉన్న అమెరికా సరఫరా F-16 ఫైటర్ జెట్ విమానాల నిర్వహణకు 397 మిలియన్ డాలర్లు మంజూరు చేసింది. ఈ నిధులను భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూసుకోవడానికి అమెరికా ప్రత్యేకంగా పర్యవేక్షణించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల్ని ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు ఖచ్చితంగా కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కాగా.. పాకిస్తాన్ ఉపయోగిస్తున్న F-16 ఫైటర్ జెట్లు అమెరికా (USA) అందించింది. అత్యాధునిక ఈ ఫైటర్ జెట్లను లాక్ హీడ్ మార్టెన్ సంస్థ తయారు చేస్తుండగా.. 1980లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దండయాత్ర చేసిన తర్వాత పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా ఈ జెట్లను పాక్ కు ఇచ్చింది.
అయితే.. వాస్తవానికి జనవరి 20న ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ సహాయాన్ని నిలిపివేశారు. ఏ దేశానికి, సంస్థలకు అమెరికా నిధుల్ని విడుదల చేయకుండా నిలిపివేసింది. అయినప్పటికీ.. పాకిస్థాన్ కు మాత్రం ప్రత్యేకంగా సాయం చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ నిధులను నిలిపివేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ఉన్నప్పటికీ.. అమెరికా భద్రతా సంబంధిత మినహాయింపులలో సుమారు $5.3 బిలియన్లను మంజూరు చేసింది.
పాకిస్తాన్‌కు భద్రతా సహాయంపై ట్రంప్ వైఖరి సంవత్సరాలుగా అనేక మార్పులకు గురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2018లో తన మొదటి పదవీకాలంలో, ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు తగినంతగా లేవని పేర్కొంటూ ఆయన సైనిక సహాయాన్ని తగ్గించారు. ఆ తరువాత బైడెన్ పరిపాలన మద్దతును పునరుద్ధరించారు.. పాకిస్తాన్ F-16 విమానాలను కొనసాగించేందుకు మద్ధతుగా సెప్టెంబర్ 2022లో $450 మిలియన్ డాలర్లను అందించారు.