Trump Steel Aluminium Tariffs | వాణిజ్య యుద్ధం జరిగితీరాల్సిందే అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కెనెడా, మెక్సికో, చైనాల దిగుమతులపై ఆయన భారీగా సుంకాలు విధించారు. కానీ కెనెడా, మెక్సికో ట్రంప్ పెట్టిన షరతులకు పాక్షికంగా అంగీకారం తెలపడంతో ఆయన ఆ రెండు దేశాలకు తాత్కాలికంగా సుంకాల విధింపు ఆపేశారు. చైనాకు మాత్రం ఏ మినహాయింపు ఇవ్వలేదు. అయితే తాజాగా ట్రంప్ అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను కొన్ని రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో మళ్లీ కెనెడా, మెక్సికో దేశాలు అయోమయంలో పడిపోయాయి. కాలి కేస్తే తలకు వేస్తాడు.. తలకు తీస్తే కాలి కేస్తాడు అన్న చందంగా మారింది ట్రంప్ తీరు. ఎందుకంటే అమెరికా చేసుకునే స్టీల్, అలూమినియం దిగుమతుల్లో ఎక్కువ శాతం ఈ రెండు దేశాలే సరఫరా చేస్తున్నాయి.
న్యూఓర్లీన్స్‌లో ఆదివారం ఎన్‌ఎఫ్‌ఎల్ సూపర్ బౌల్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ట్రంప్ తన ఎయిర్‌ఫోర్స్ వన్ (ప్రెసిడెంట్ ప్రయాణించే విమానం)లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల గురించి ప్రస్తావించారు. మంగళవారం నాటికి ఈ టారిఫ్‌లను ప్రకటిస్తామని, ఆ తర్వాత వెంటనే అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. అయితే, ఈ టారిఫ్‌లు ఏ దేశాలపై విధించబడతాయో ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. ‘‘మాపై ఎవరైనా సుంకాలు విధిస్తే.. మేము కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తాము’’ అని వ్యాఖ్యానించారు.
2016-2020 మధ్య ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. అయితే, ఆ తర్వాత కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి వాణిజ్య భాగస్వాములకు ఈ టారిఫ్‌ల నుండి మినహాయింపు ఇచ్చి, టారిఫ్ రహిత కోటాలు కల్పించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం బ్రిటన్, జపాన్, ఐరోపా సమాఖ్యకు ఈ కోటాలను విస్తరించింది.
అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుతం అమెరికా దిగుమతి చేసుకున్న స్టీల్ ఉత్పత్తుల్లో అధిక శాతం కెనడా, బ్రెజిల్, మెక్సికో నుంచి వస్తున్నవే. దక్షిణ కొరియా, వియత్నాం కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అల్యూమినియంలో అమెరికాకు అతిపెద్ద సరఫరాదారుగా కెనడా నిలిచింది. 2024లో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం అల్యూమినియంలో దాదాపు 79 శాతం కెనడా నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు ఈ దేశాలపైనే విధించబడతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: అమెరికా ప్రెసిడెంట్‌గా మస్క్.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఆయన చేతుల్లోనే
ట్రంప్ నిర్ణయాలతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ వారంలో వెలువడనున్న కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలపై దృష్టిపెట్టిన పెట్టుబడిదారులు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 23,500 మార్క్ దిగువకు కుంగింది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో 77,488.95 వద్ద, నిఫ్టీ 116.1 పాయింట్ల నష్టంతో 23,443.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. ఏకంగా 44 పైసలు క్షీణించి 97.94 వద్ద జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా షేర్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. అయితే, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, సిప్లా, రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగాయి.
స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్ నిక్కీ 0.1 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 0.13 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.31 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.47 శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డోజోన్స్ 0.99 శాతం, నాస్‌డాక్ 1.36 శాతం, ఎస్‌అండ్‌పీ సూచీ 0.95 శాతం మేర కుంగాయి.