అమెరికా సుంకాల మోత చాలా దేశాలను కలవరపెడుతోంది. ప్రధానంగా భారత్ పై ఈ దెబ్బ గట్టిగానే పడిందని చెప్పాలి. అదే సమయంలో అటు చైనాతో కూడా అమెరికా ట్రేడ్ వార్ కొనసాగిస్తోంది. చైనా దిగుమతులపై కూడా ట్రంప్ 50శాతం సుంకాలు విధించారు, తాజాగా భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా సుంకాలను 50శాతానికి పెంచారు. ఇక్కడ అమెరికా ఇరు దేశాలకు శత్రువుగా మారింది. ఈ దశలో డ్రాగన్ నుంచి మనకు ఊహించని మద్దతు లభిచడం విశేషం.
చైనా మద్దతు..
ట్రంప్ సుంకాల మోతను భారత విదేశాంగ శాఖ ఖండించిన విషయం తెలిసిందే. ఇది ఒక దురదృష్టకరమైన చర్య అని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే తమ ముందున్న కర్తవ్యం అని భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనను సమర్థిస్తూ చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేయడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. పత్రికల్లో వచ్చిన సంపాదకీయాన్ని కూడా యు జింగ్ తన ట్వీట్ కి జోడించారు. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా సమర్థిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో తాము భారత్ కి మద్దతిస్తున్నట్టు చెప్పారు. భారతదేశ సార్వభౌమాధికారంపై చర్చించాల్సిన అవసరం లేదని, వారి విదేశాంగ విధాన ఎంపికలను ఇతర దేశాలు ప్రభావితం చేయలేవని, ఆ దేశ ప్రజల ప్రయోజనాలు వారికి ఎంతో ముఖ్యమైనవని యు జింగ్ తన ట్వీట్ లో తెలిపారు.
“India’s sovereignty is non-negotiable and its foreign policy choices cannot be manipulated by other countries, no matter how significant their own ties with India are.”—-Quoted from @the_hindu https://t.co/U0WT6bLPXM pic.twitter.com/8yDizYeEyM
— Yu Jing (@ChinaSpox_India) August 6, 2025
అసలు కథేంటి?
భారత్-చైనా మధ్య సరిహద్దు వైరం ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు పాకిస్తాన్ కి కూడా చైనా ఆయుధాలు సరఫరా చేస్తోంది. అయితే అంతర్జాతీయ వాణిజ్యాన్ని మనం కాదని చెప్పలేం, అదే సమయంలో పాకిస్తాన్ కి చైనా చేస్తున్న సాయాన్ని అంత తేలిగ్గా తీసిపారేయలేం. అందుకే చైనా విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. 2019 తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకు చైనా సందర్శనకు వెళ్లలేదు. తాజాగా ఆయన చైనా పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధులు భారత్ కి మద్దతుగా ట్వీట్ వేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈనెల చివర్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మోదీ చైనాకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
అమెరికా సుంకాల వల్ల భారత్, చైనా రెండూ నష్టపోతాయి. ఇటు భారత్ కి కూడా ప్రత్యామ్నాయ మార్కెట్ అవసరం ఎంతైనా ఉంది. అటు చైనా ఆలోచన కూడా అదే. ఈ దశలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఉంటే అమెరికా దారికొచ్చే అవకాశం ఉంది. దీంతో చైనా ఓ మెట్టు దిగి అయినా సరే భారత్ కి స్నేహ హస్తం అందించాలని చూస్తోంది. అందులో భాగంగానే భారత్ కి చైనా ఊహించని మద్దతునిచ్చింది. అయితే డ్రాగన్ వ్యూహం పట్ల భారత్ జాగరూకతతో ఉండాలని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. చైనాతో అతి మంచితనం ప్రమాదం అనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలంటున్నారు.