Stephen Miller: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతల నుంచి సుసీ వైల్స్ ను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె స్థానంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ సోమవారం నుంచి కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని శనివారం అధికారికంగా ప్రకటించారు.
అయితే పదవి నుంచి తప్పుకున్నప్పటికీ సుసీ వైల్స్ ట్రంప్ కోటరీలోనే కొనసాగనున్నారు. ఆమెను తన ‘పొలిటికల్ ఆపరేషన్’ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ వేదికగా వెల్లడించారు. కాగా, 2024 ఎన్నికల విజయం తర్వాత ట్రంప్ నియమించిన తొలి అధికారి వైల్స్ కావడం విశేషం. అంతేకాకుండా అమెరికా చరిత్రలోనే వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘సుసీ వైల్స్ అద్భుతమైన సేవలు అందించారు. ఆమె చేసిన సేవలకు ధన్యవాదాలు’ అని కొనియాడారు. అయితే ఎన్నికల ఓటమి వల్లే ఈ మార్పులు చేశారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. ‘మార్పునకు ఇది సరైన సమయం మాత్రమే. ఎన్నికల ఫలితాలకు దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఆ ఎన్నికల్లో నేను పోటీ పడలేదు’ అని స్పష్టం చేశారు.
41 ఏళ్ల స్టీఫెన్ మిల్లర్ ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచే స్పీచ్ రైటర్‌గా ట్రంప్ బృందంలో చేరిన మిల్లర్.. అధ్యక్షుడికి అత్యంత నమ్మకస్తుడైన సలహాదారుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల వెనుక ఈయనే కీలక సూత్రధారి. వైట్‌హౌస్‌లో చేరడానికి ముందు మిల్లర్ అల్బామా మాజీ రష్యన్ సెనేటర్ జెఫ్ సెషన్స్ వద్ద పనిచేశారు. అటు మిల్లర్ నియామకంపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. స్టీఫెన్ మిల్లర్ గొప్ప దేశభక్తుడని, ఆయనకు ఈ పదవి దక్కడం సరైన గుర్తింపు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు.. కొత్తగా ఐదు కీలక పదవులు.. ఢిల్లీ స్థాయిలో నేతల లాబీయింగ్!
బాధ్యతల నుంచి తప్పుకోవడంపై సుసీ వైల్స్ స్పందిస్తూ.. ‘వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రెసిడెంట్ ట్రంప్‌కు సేవ చేయడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. సరిహద్దుల భద్రత, పన్నుల తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి ఎన్నో లక్ష్యాలను సాధించడంలో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను’ అని పేర్కొన్నారు. పదవి మారినా ట్రంప్ లక్ష్యాల పట్ల తన అంకితభావం మారదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ తొలి విడత పాలనలో నలుగురు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌లు మారగా వారి కంటే సుసీ వైల్స్ ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగడం గమనార్హం.
Also Read: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు నేడే.. ఓట్ల లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రాల్లో టెన్షన్ టెన్షన్!