BigTV English

H-1B Visa: లక్ష డాలర్లు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

H-1B Visa: లక్ష డాలర్లు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

అమెరికాకు వచ్చే మేధో వలసను ఆపాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఉద్యోగాలపై భారతీయులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. H-1B వీసా దరఖాస్తులపై రుసుముని లక్ష డాలర్లకు పెంచారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.88 లక్షలు. వాస్తవానికి ఈ దరఖాస్తు ఖర్చులన్నీ కంపెనీలే భరిస్తుంటాయి. గతంలో ఇవి నామమాత్రంగా ఉండేవి. ఇకపై భారతీయ ఉద్యోగుల్ని అమెరికాకు రప్పించి పనిచేయించుకోవాలంటే సదరు కంపెనీ ఏడాదికి రూ.88 లక్షలు దరఖాస్తు రుసుముగా చెల్లించాలనమాట. ఆ స్థాయిలో చెల్లింపులకు ఇష్టపడని కంపెనీలు అమెరికాలోనే ఉద్యోగుల్ని వెదుక్కోవాల్సి ఉంటుంది. ఇదే ట్రంప్ ప్లాన్.


విదేశీయిలు వద్దు..
అమెరికాకు విదేశీయులు వద్దని, వారి వళ్ల అమెరికా ఆదాయం తగ్గిపోతుందని, సంపద తరలిపోతుందనేది ట్రంప్ వాదన. గత ఎన్నికల్లో కూడా ఇదే వాదనతో ఆయన ప్రజల మద్దతు కూడగట్టారు. వలసలను పూర్తిగా ఆపేస్తామని చెప్పారు. అనధికారిక వలసలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపారు ట్రంప్. వివిధ దేశాలనుంచి అనధికారికంగా అమెరికా వచ్చి నివశిస్తున్న వారిని వెనక్కి తిప్పి పంపించేశారు. ఇప్పుడు అధికారిక వలసలపై కూడా ఆయన దృష్టిసారించారు. ముఖ్యంగా భారత్ నుంచి వలసలకు ప్రధాన కారణంగా ఉన్న H-1B వీసాలపై సంస్కరణలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన తాజాగా సంతకం చేశారు. వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ఫ్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. H1-B నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ అనేది ప్రస్తుత అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అత్యంత దుర్వినియోగం అవుతోందని ఆయన తెలిపారు. తాజా నిర్ణయం వల్ల కంపెనీలు H-1B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి చెల్లించే రుసుము లక్ష డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. అంటే ఆ స్థాయి నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే కంపెనీలు అమెరికాకు రప్పించుకుంటాయని ఆయన అంటున్నారు.

ఎవరికి నష్టం?
H-1B వీసా విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం భారత్ పై ఎక్కువగా ఉంటుంది. H-1B వీసా అనేది తాత్కాలిక US వర్కింగ్ వీసా. ఆయా కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో నియమించుకోడానికి తీసుకుంటాయి. 1990 నుంచి ఇది అమలులో ఉంది. ప్రారంభంలో దీన్ని మూడేళ్లకు ఇస్తారు, తర్వాత గరిష్టంగా ఆరేళ్లకు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్ తీసుకున్న వారికి ఈ వీసాను నిరవధికంగా పొడిగించే అవకాశం ఉంటుంది. అందుకే భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాతో అమెరికా వెళ్లి, గ్రీన్ కార్డ్ తీసుకుని అక్కడే స్థిరపడిపోతుంటారు. ఇటీవల ఈ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. H-1B వీసాల జారీని పరిమితం చేస్తూ, లాటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. అయినా కూడా వలసలు ఆగకపోవడంతో లక్ష డాలర్ల రుసుముతో షాకిచ్చారు ట్రంప్.


H-1B వీసాలు తీసుకునేవారిలో భారతీయల సంఖ్య అధికం. అమెరికా ఇచ్చే H-1B వీసాల్లో 71శాతం వాటా భారత్ దే. చైనా 11.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. అంటే ఈ కొత్త నిబంధనల వల్ల భారత్ నిపుణులు ఎక్కువగా నష్టపోతుందని స్పష్టమైంది. ఈ ఏడాది ప్రథమార్థంలో అమెజాన్, ఆ కంపెనీ క్లౌడ్-కంప్యూటింగ్ యూనిట్, AWS సంస్థలు 12,000 కంటే ఎక్కువ H1-B వీసాలకు ఆమోదం పొందాయి. మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు ఒక్కొక్కటి 5,000 కంటే ఎక్కువ H-1B వీసాలకు ఆమోదం పొంతాయి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు H-1B వీసా పొందాలంటే ఓ కఠినమైన పరీక్షను కూడా రాయాల్సి ఉండేది. అమెరికా చరిత్ర, రాజకీయాలను కవర్ చేసే 128 ప్రశ్నలకు వారు సమాధానాలు రాయాలి. అందులోని 20 ప్రశ్నలలో 12 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం చెప్పాలి. ఆ తర్వాత జో బైడెన్ ఆ విధానాన్ని రద్దు చేశారు. తిరిగి ట్రంప్ వచ్చిన తర్వాత లక్ష డాలర్ల రుసుము పేరుతో అందరికీ షాకిచ్చారు.

‘గోల్డ్ కార్డ్’ వీసా..
ఇక గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కూడా ట్రంప్ తాజాగా సంతకం చేశారు. వ్యక్తులకు 10లక్షల డాలర్లు తీసుకుని ఈ గోల్డ్ కార్డ్ ఇస్తారు. వ్యాపార సంస్థలకు దీన్ని 20 లక్షల డాలర్లుగా నియమించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్‌ డాలర్లు సమకూరే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికాలో అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్‌కార్డు నిధులు వినియోగిస్తామని ట్రంప్ తెలిపారు.

Related News

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Anti-immigrant Sentiment: లండన్ నిరసనలు.. ఎవరికి పాఠం, ఎవరికి గుణపాఠం?

Donald Trump: అక్రమ వలసలే అన్నిటికీ కారణం.. భారత సంతతి వ్యక్తి దారుణ హత్యపై ట్రంప్ స్పందన

London: నిరసనలతో దద్దరిల్లిన లండన్‌.. లక్షమంది హాజరు, అదే ప్రధాన ఎజెండా?

Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

Big Stories

×