Twenty five people have been killed in Haiti after a fuel tanker exploded: ఒక్కోసారి జనం అత్యుత్సాహం వారి ప్రాణాలమీదకే వస్తుంది. ఎక్కడైనా ఉచితంగా వస్తోందంటే దేనినీ జనం వదలరు. అది వారి ప్రాణాలకు ముప్పని తెలిసినా తమ ప్రయత్నాలు మానుకోరు. సరిగ్గా ఇలాంటి సంఘటనే శనివారం హైతీ నగరంలో చోటుచేసుకుంది. మిరాగానే ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలిపోవడంతో ట్యాంకర్ ఆకస్మికంగా పేలిపోయింది. ట్యాంకర్ బోల్తా పడటంతో అక్కడికక్కడే 25 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా గాయాలయ్యాయి.హఠాత్తుగా టైరు పేలిపోవడంతో ఇంధనం లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పింది. ఒక్కసారిగా తలక్రిందులయింది. దీనితో ట్యాంకర్ నుండి ఆయిల్ రోడ్డుపై లీక్ అవడంతో పెద్ద సంఖ్యలో జనం ఆయిల్ కోసం ఎగబడ్డారు. అయితే హఠాత్తుగా పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆయిల్ కోసం ఎగబడ్డ జనం మంటలకు ఆహుతయ్యారు.అక్కడిక్కడే 25 మంది దాకా మృతి చెందినట్లు తెలుస్తోంది.
మాటలకందని దుర్ఘటన
సమాచారం అందుకున్న హైతీ పోలీసులు సకాలంలో స్పందించారు. అయితే మంటల్లో గాయపడ్డవారికి ప్రాధమిక చికిత్స అందించారు. కొంతమందిని అత్యవసరమైతే హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కోనిల్ మాట్లాడుతూ ఇది మాటలకందని దుర్ఘటన..మంటల్లో కాలిపోయిన మృత దేహాలతో ఆ ప్రదేశం అంతా భయానకంగా మారింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర సహాయం చేసేందుకు సహాయక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని..గాయపడ్డ వారికి సత్వరమే వైద్య సాయం అందిస్తామని అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని..ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.