UK PM Diwali Party| కొన్ని రోజుల క్రితం జరిగిన దీపావళి పండుగ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఘనంగా జరిగాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, కెనెడా, బ్రిటన్ దేశాలలో కూడా అక్కడి హిందువులను మెప్పించేందుకు పండుగ వేడుకలు నిర్వహించారు. కొందరు ఆ వేడుకల్లో పాల్గొన్నారు కూడా. అయితే బ్రిటన్ దేశంలో ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకల్లో అపశృతి జరిగింది. దీనిపై బ్రిటన్ లోని హిందువులు మండిపడ్డారు. దీంతో తప్పు జరిగిందని గమనించిన ప్రధాన మంత్రి స్టార్మర్ హిందువులను క్షమాపణలు కోరారు.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ దేశంలోని లండన్ నగరంలో ఆ దేశ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్.. అక్టోబర్ 29, 2024న 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో లండన్ లోని ప్రముఖ హిందువులంతా పాల్గొన్నారు. అయితే దీపావళి పార్టీ రిసెప్షన్ లో అపశృతి జరిగింది. దీపావళి ప్రాముఖ్యత తెలియని ఆంగ్లేయ ప్రభుత్వం పార్టీ రిసెప్షన్ లో అతిథులకు మాంసాహారం వడ్డించారు. మద్యం కూడా పార్టీ అందుబాటులో ఉంది. ఇది తెలిసిన బ్రిటన్ హిందూ సామాజికవర్గం ప్రభుత్వం హిందువుల సంప్రదాయాలను పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: గూగుల్‌కు భారీ జరిమానా విధించిన రష్యా .. 20 డెసిలియన్ డాలర్లు.. అంటే 2 తరువాత 34 జీరోలు!
ముఖ్యంగా బ్రిటీష్ ఇండియన్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ శివానీ రాజా ప్రధాన మంత్రి స్టార్మర్ కు అధికారికంగా ఒక లేఖ రాశారు. అందులో దీపావళి వేడుకలు హిందు సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించలేదని తెలిపారు. “ఈ సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన దీపావళి వేడుకలు చాలా నిరాశజనకంగా సాగాయి. హిందువుల పండుగల గురించి, సంప్రదాయాల గురించి కనీస అవగాహన లేకుండా వేడుకలు నిర్వహించారు. లెయిసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గానికి ఎంపీ అయిన నా నియోజకవర్గంలోని వేల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తూ చాలా బాధ్యతగా ఈ లేఖ రాస్తున్నాను. ఈ సంవత్సరం దీపావళి వేడుకలను.. దేశంలోని అత్యున్నత కార్యాలయం నిర్వహించిన తీరు చాలా బాధాకరంగా సాగింది. వేడుకల నిర్వహణ చాలా లోపాలు కనిపించాయి. భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా హిందూ పండుగల వేడుకలు నిర్వహిస్తే నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని ప్రతిపక్ష ఎంపీ శివానీ రాజా తన లేఖలో పేర్కొన్నారు.
ఎంపీ శివానీ రాజాతో పాటు బ్రిటన్ దేశంలోని చాలా మంది హిందూ రాజకీయ నాయకులు కూడా వేడుకల నిర్వహణ తీరుపై మండిపడ్డారు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వేడుకలు నిర్వహించారని అధికారంలోని లేబర్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వేడుకల్లో మద్యం, మాంసాహారం ఎలా వడ్డిస్తారని అధికార పార్టీని నిలదీశారు.
విషయం సీరియస్ కావడంతో ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం అధికారికంగా క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన జారీ చేసింది. “ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ దేశంలోని అన్ని సామాజిక వర్గ ప్రజలకు గౌరవభావంతో చూస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల డౌనింగ్ స్ట్రీట్ వద్ద దీపావళి వేడుకలు నిర్వహించారు. బ్రిటన్ అభివృద్ధిలో భాగమైన బ్రిటీష్ హిందూ, సిక్కులు, జైన మతస్తులను ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే దీపావళి వేడుకల్లో ఒక తప్పిదం జరిగిపోయింది. హిందువుల మనోభావాలను మేము అర్థం చేసుకొని.. మేము వారి నుంచి క్షమాపణలు కోరుతున్నాం. ఇలాంటి తప్పిదం భవిష్యత్తులో జరగదని హామీ ఇస్తున్నాం.” అని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.