Ukraine War : ఉక్రెయిన్ యుద్ధంలో జీవ, రసాయన ఆయుధాలను వినియోగించారా? అవుననే అంటోంది రష్యా. పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్‌ను చొప్పించే పనిని ఉక్రెయిన్ ఇప్పటికే పూర్తి చేసిందని వ్లాదిమిర్ పుతిన్ బృందంలో అత్యంత కీలక అధికారి, లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిలోవ్ ఆరోపించారు. రష్యా ఆక్రమిత ప్రాంతంలోని పందుల్లో చొప్పించారని ఆయన ధ్వజమెత్తారు.
అంతే కాదు.. సైనేడ్ తరహా రసాయనాలతో మంచినీరు, ఫుడ్ సప్లైస్, ఆఖరికి జంతువుల ఆహారాన్ని కూడా కలుషితం చేసే పనికి ఒడిగడుతున్నారని ఆయన ఆరోపించారు. జీవ, రసాయన ఆయుధాలు, రేడియేషన్ నుంచి రష్యా బలగాలకు రక్షణ కల్పించే విభాగం కమాండర్‌గా కిరిలోవ్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలోనూ ఆయన అమెరికాపై ఇలాంటి సంచలనమైన ఆరోపణలే చేశారు.
డ్రోన్ల ద్వారా దోమలను పంపడం ద్వారా తమ బలగాలను నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని అగ్రరాజ్యం అమలు చేస్తోందంటూ ఆరు నెలల క్రితం ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కదనరంగంలో తమను ఓడించే సత్తా లేని ఉక్రెయిన్.. ఇలా జీవ, రసాయన ఆయుధాల వినియోగం ద్వారా దొంగ దెబ్బ తీసేందుకు సిద్ధమైందని కిరిలోవ్ దుయ్యబట్టారు. ఆ ఆపరేషన్లను ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
అమెరికా కంపెనీ తయారు చేసిన రసాయనాలను అక్టోబర్-నవంబర్ నెలల మధ్య స్వల్పమొత్తంలో ఉక్రెయిన్ కంపెనీ రియల్లాబ్ ద్వారా ఉక్రెయిన్ ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా తమ నిఘా వర్గాలు ఉప్పందించాయని కిరిలోవ్ చెప్పుకొచ్చారు.
మంచినీటి వనరుల్లో విషాన్ని కలిపేందుకు ఉక్రెయిన్ సాయుధ బలగాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
రష్యా ఆక్రమిత జపోరిజియా రీజియన్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్(ASFV) ప్రబలిన నేపథ్యంలో వేల సంఖ్యలో పందులను చంపేసిన విషయాన్ని కిరిలోవ్ గుర్తుచేశారు. ఆ వైరస్ కారణంగా 7 వేలకు పైగా జంతువులను వధించారన్నారు. ఈ ఆరోపణలను అమెరికా, ఉక్రెయిన్ ఖండిస్తున్నాయి. బట్ట కాల్చి విసిరేసిన చందంగా.. యుద్ధనీతిని అతిక్రమించిన చరిత్ర క్రెమ్లిన్‌కు ఉందని ఆరోపించాయి.