Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడా కన్వెన్షన్ సెంటర్ లో ఎన్నికల్లో విజయంపై ప్రసంగిస్తూ.. తన భార్య మెలానియా ట్రంప్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
ఆమె మద్ధతు తనకు ఎంతో సహాయపడిందన్న ట్రంప్.. స్టేజీ పైనే కౌగిలించుకుని, ముద్దు పెట్టి ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు.. అతిపెద్ద రాజకీయ మలుపుగా అభివర్ణించారు. ఈ మొత్తం సభలో.. మెలానియా ట్రంప్ గురించి ట్రంప్ చేసిన ప్రసంగమే.. ఆకర్షణగా నిలిచింది. అమెరికా ప్రథమ మహిళగా ఓసారి గౌరవం దక్కించుకున్న ఈ లేడి.. ఇప్పుడు మరోసారి అదే గౌరవాన్ని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. మెలానియా ట్రంప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
మెలానియా ట్రంప్.. అమెరికా దేశస్థురాలు కాదు. ఆమె యుగోస్లేవియాలో పుట్టి పెరిగారు. అక్కడే లుబ్జానా యూనివర్శిటీలో చదివిని మెలానియా.. మోడలింగ్ మీద ఆసక్తితో మధ్యలోనే వదిలేసింది. తర్వాత మోడల్ గా మంచి గుర్తింపు సాధించి.. వివిధ దేశాల్లోని పోటీల్లో పాల్గొంది. తొలుత యుగోస్లోవియా.. తర్వాత ప్యారిస్ లో మోడల్ గా మంచి గుర్తింపు పొందింది. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే మోడలింగ్ రంగంలో ప్రవేశించిన మెలానియా.. ఆ తర్వాత వివిధ ప్రముఖ మ్యాగజైన్ల కవర్ పేజీలపై దర్శనమిచ్చింది.
మెలానియా మోడలింగ్ రంగంలో ఉంటే.. మొదటి నుంచి ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే 1998లో న్యూయార్క్ లో నిర్వహించిన ఫ్యాషన్ ఇండస్ట్రీ పార్టీలో మెలానియా – ట్రంప్ ను మొదటిసారి కలుసుకున్నారు. 1999 లో తన రెండో భార్య మార్లా మాపుల్స్ తో విడాకులు తీసుకున్న ట్రంప్.. మెలానియాతో స్నేహంగా గడిపారు. చాలా కాలం పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు.. 2005లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పుడు ట్రంప్ పెళ్లికి..ముఖ్య అతిథిగా 2016 అమెరికా అధ్యక్ష పోటీల్లో ట్రంప్ నకు పోటీగా నిలిచిన హిల్లరీ క్లింటన్ కావడం విశేషం.
మెలానియాతో పెళ్లికి ముందే ట్రంప్ నకు రెండు పెళ్లిళ్లు కాగా.. నలుగురు పిల్లలున్నారు. మెలానియాతో కలిసి ఐదో సంతానాన్ని కన్నారు. మోడల్ గా మంచి కెరీర్ సాధించిన మెలానియా.. తర్వాతి కాలంలోనూ వివిధ వ్యాపారాల్లోకి అడుగు పెట్టి విజయం సాధించారు. తొలుత ఓ జ్యూయలరీ సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపించారు. ఆ తర్వాత.. స్కిన్ కేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేసే సంస్థను నెలకొల్పి విజయవంతం చేశారు.
2015లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినప్పుడు.. ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిపించిన మెలానియా.. అనేక సందర్భాల్లో ట్రంప్ ను సమర్థిస్తూ వచ్చారు. ఒకానొక దశలో ట్రంప్ పై వరుస వేధింపుల ఆరోపణలు రావడంతో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు సైతం.. మెలానియా ట్రంప్ వెంట నిలిచారు. అలా.. 2016లో అధ్యక్ష పదవి దక్కించుకున్న డోనాల్డ్ ట్రంప్.. క్లింటన్‌ను ఓడించి మంచి ఫలితాల్ని సాధించారు. చదువుల్లోనూ మంచి నైపుణ్యాలున్న మెలానియా.. ఏకంగా ఆరు ఆరు భాషలు మాట్లాడగలుగుతుంది. అలాగే.. అమెరికా ప్రథమ మహిళగా పనిచేసిన రెండో విదేశీ వనితగానూ మెలానియా నిలిచారు. కాగా.. ఆమె కంటే ముందు.. ఆరో అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూయిసా ఆడమ్స్ మొదటి విదేశీ మహిళ.. అమెరికా ప్రథమ మహిళగా పనిచేశారు.
ఎన్ని బాధ్యతలున్నా తల్లిగా పిల్లల సంరక్షణ కోసం ఆలోచించే మెలానియా.. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైట్ హౌస్ లోకి అడుగు పెట్టలేదు. ఆమె కొడుకు విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు.. ఆ పిల్లవాడి బాధ్యతలు చూస్తూ ఉండిపోయారు. పిల్లలంటే ఎంతో ఇష్టపడే మెలానియా.. సైబర్ బెదిరింపుల నుంచి పిల్లలను రక్షించేందుకు బీ- బెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా నాలుగేళ్లు ట్రంప్ పక్కనే ఉన్న మెలానియా.. 2020 ఎన్నికల నాటికి మాత్రం రాజకీయ ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. తిరిగి ఇప్పుడు.. ట్రంప్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
Also Read : కమల హ్యారిస్ ఓటమితో.. తమిళనాడులోని ఈ గ్రామంలో నిరాశ.. ఎందుకంటే.?
2020లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత.. కాపిటల్ భవనంపై ట్రంప్ మద్ధతుదారులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసాయి. ఆ సమయంలో ఓ సారి స్పందించిన మెలానియా.. దేశంలో జరుగుతున్న దాడులను, హింసను ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అలాగే.. గత సంప్రదాయాలను పక్కన పెట్టేసిన మెలానియా.. తన భర్త పదవి దిగిపోయినప్పుడు.. తర్వాత వచ్చే అధ్యక్షుడి భార్యకు టీ వింధు ఇవ్వలేదు. దాంతో.. ఆమె వైఖరిపై.. యూఎస్ లో కొంత చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ తిరిగి.. ట్రంప్ అధ్యక్ష బరిలోకి నిలవడంలోనూ, ఎన్నికల్లో మంచి విజయం సాధించడంలోనూ కీలకంగా వ్యవహరించారు.