
US Mass Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ గర్జించింది. మైనే స్టేట్‌లోని లూయిస్టన్ నగరం కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బార్ బౌలింగ్ అల్లే, వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కనిపించిన అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గతేడాది మే తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదే. మే 2022లో టెక్సాస్ లోని ఒక స్కూల్‌లో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు.