
Kishan Reddy : కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పై బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద దాడి చేశారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో.. బుధవారం ఓ టీవీ ఛానల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యలను లేవనెత్తుతూ సూరారం రామ్ లీలా మైదానంలో బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ చర్చలో.. భూ కబ్జాల విషయమై శ్రీశైలం గౌడ్, వివేకానంద మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద.. శ్రీశైలం గౌడ్ పై వేదికపైనే దాడిచేసి గొంతు పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఎంతకైనా తెగిస్తారంటూ ప్రతిపక్షాలు విమర్శలు అందుకున్నాయి.
ఇదే చర్చావేదికలో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడైన కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఈసారి కూడా తమను గెలిపించాలని ప్రజలను కోరేది ఇలా దాడులు చేసేందుకేనా అని ప్రశ్నించారు. పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థిపై బహిరంగంగా దాడి చేయడం, గొడవ చేయడం చాలా దిగ్భ్రాంతికరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలపై కూడా ఇదే మాదిరిగా దాడి చేస్తారా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పబ్లిక్ లో జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
