అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందులో ఉన్న 242మందిలో ఒకే ఒక్కరు బతికి బయటకొచ్చారు. భారతీయ మూలాలున్న ఆ బ్రిటన్ జాతీయుడు పేరు విశ్వాస్ కుమార్. విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్ 11-ఎ. ఆ సీటు విమానం రెక్కలకు సమీపంలో ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్ కి పక్కగా ఉంటుంది. అక్కడ ఉన్న ఆ సీటులో ఉన్న వ్యక్తి మాత్రం బతికాడు, మిగతా అన్ని సీట్లలో కూర్చున్న ప్రయాణికులు, చివరకు సిబ్బంది కూడా అందరూ మరణించారు. దీంతో ఆ సీట్ వ్యవహారం ఆసక్తిగా మారింది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 27 ఏళ్ల క్రితం అదే సీటులో కూర్చున్న మరో వ్యక్తి కూడా విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ రెండు ఘటనల మధ్య సారూప్యం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.
అప్పుడు బతికింది ఎవరంటే..?
విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్11-ఎ అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆసక్తిగా దాని గురించి తెలుసుకున్నారు. అయితే తన జీవితంలో జరిగిన ఘటనతో ఈ ప్రమాదాన్ని పోల్చి చూసుకున్న థాయిలాండ్ కి చెందిన నటుడు రువాంగ్ సక్ లాయ్ చుసాక్ మాత్రం షాకయ్యాడు. ఎందుకంటే ఆయన కూడా గతంలో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంతే కాదు, ఆయన సీట్ నెంబర్ కూడా 11-ఎ.
1998 డిసెంబర్ 11న థాయిలాండ్ నటుడు, గాయకుడు రువాంగ్ సక్ లాయ్ చుసాక్ థాయ్ ఎయిర్‌వేస్ విమానం (TG261)లో ప్రయాణించాడు. ఆ విమానం దక్షిణ థాయిలాండ్‌లో ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. అందులో మొత్తం 146 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 45మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో రువాంగ్ సక్ లాయ్ చుసాక్ కూడా ఒకరు. ఆయన సీట్ నెంబర్ 11-ఎ. అప్పట్లో ఆయన తన సీట్ నెంబర్ ని గుర్తుంచుకున్నారు కానీ అందులో విశేషం ఉందని అనుకోలేదు. కానీ 27 ఏళ్ల తర్వాత భారత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి తెలుసుకున్నాక ఆయన షాకయ్యారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్ తెలుసుకున్నాక రువాంగ్ సక్ లాయ్ చుసాక్ ఆశ్చర్యపోయారు. ఆ సీట్ నెంబర్ లో ఏదో మహత్యం ఉందని అంటున్నారాయన. 27 ఏళ్ల క్రితం తాను ఎలా ప్రమాదం నుంచి బయటపడ్డానో, అదే సీట్ లో కూర్చున్న విశ్వాస్ కుమార్ కూడా అలాగే బతికి బయటపడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
విమానంలో 11-ఎ సీట్ అనేది విండో సీట్. అది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి పక్కనే ఉంటుంది. ఈ సీటుకి అటువైపు కూడా డోర్ వద్ద మరో సీటు ఉంటుంది. కానీ ఈ సీటులో కూర్చున్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ మాత్రమే బతకడం విశేషం. అంతే కాదు, 1998లో జరిగిన ప్రమాదంలో కూడా 11-ఎ సీట్ లో కూర్చున్న రువాంగ్ సక్ లాయ్ చుసాక్ బతకడం అంతకంటే ఆశ్చకరమైన అంశం. ఈ ఇద్దరి సీట్ నెంబర్లను పోల్చి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినపడుతున్నాయి. ఈ సీటు అత్యంత సేఫ్టీ ప్లేస్ అని అంటున్నారు కొందరు. అయితే విమాన ప్రయాణాలు, ప్రమాదాలపై జరిగిన అధ్యయనాల్లో ఆ సీటుకి అంత ప్రాధాన్యత లేదని తేలింది.