నిన్నటి వరకు Xలో మాల్దీవులకు వ్యతిరేకంగా గళమెత్తిన భారతీయులు.. నేడు జర్మనీ అమానవీయ ధోరణికి వ్యతిరేకంగా గొంతువిప్పుతున్నారు. జర్మనీ మీద సడెన్‌గా ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? దీని వెనక జరిగిన కథేంటో తెలుసుకుంటే.. మీరు మీరు ఆశ్యర్యపోవాల్సిందే.
2018లో ఉద్యోగం నిమిత్తం ముంబైకి చెందిన భవేష్ షా, ధారా షా అనే దంపతులు జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి పాప పుట్టింది. ఆ పాప పేరు.. అరిహా షా. ఒకరోజు తల్లి.. పాపకు స్నానం చేయిస్తుండగా, ప్రైవేట్ పార్ట్ వద్ద చిన్న దెబ్బ తగలటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకుపోయారు. అయితే.. అక్కడ పాపను చూసిన డాక్టర్.. వెంటనే స్థానికంగా లైంగిక వేధింపులను పర్యవేక్షించే ప్రభుత్వ విభాగం వారికి సమాచారమిచ్చారు.
చిన్నారికి తగిలిన గాయాన్ని పరిశీలించి ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని సదరు డాక్టరు, అధికారులు అనుమానించారు. దీంతో ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను జర్మనీ అధికారులు తీసుకున్నారు. 2021 సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది.
దీంతో అరిహా తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయ పోరాటం చేశారు. అయితే.. పాపను తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించేందుకు జర్మనీ కోర్టు నిరాకరించింది. ఆ పాప గాయాలపై పెరేంట్స్ సరైన సమాధానం ఇవ్వకపోయారంటూ వారి పిటిషన్‌ను తిరస్కరించింది.
కనీసం తమ చిన్నారిని భారతీయ సంక్షేమ సేవా సంస్థకు అప్పగించాలంటూ తాజాగా బెర్లిన్‌లోని పాంకోవ్‌లోని కోర్టును తల్లిదండ్రులు అభ్యర్థించారు. అయితే దానికీ జర్మనీ కోర్టు నిరాకరించింది. 2021 సెప్టెంబరు నుంచి పాప జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయ అధికారుల పర్యవేక్షణలోనే ఉండిపోయింది.
మరోవైపు పాప తల్లిదండ్రులు.. విదేశాంగ మంత్రి జై శంకర్‌కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు కూడా లేఖ రాశారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అరిహాను త్వరగా భారత్‌కు పంపించాలని జర్మనీకి విజ్ఞప్తి చేసింది.
చిన్నారి సామాజిక, సాంస్కృతిక, భాషా హక్కులకు భంగం వాటిల్లుతున్నదని, తక్షణం పాపను తల్లిదండ్రులకు అప్పగించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. భారత్‌లోని 19 రాజకీయ పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు కూడా ఇటీవల జర్మనీ రాయబారికి లేఖ రాశారు. జర్మనీ తీరు ఆందోళన కలిగిస్తున్నదని భారత విదేశాంగ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అయినా.. జర్మనీ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవటంతో పాప కోసం.. పెద్దసంఖ్యలో నెటిజన్లు ట్విట్టర్‌లో రంగంలోకి దిగారు. దీంతో #BoycottGermany హ్యాండిల్ నేడు మోగిపోతోంది.