అది ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్. రెండు బెడ్ రూమ్స్ లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. కానీ ఒకదానిలో బాత్ టబ్ లేదు. బాత్ టబ్ లేని ఫ్లాట్ నాకెందుకంటూ కస్టమర్ కోర్టు మెట్లెక్కింది. ఈ వ్యవహారం కాస్త అతిగా ఉన్నా.. ఆమె న్యాయపోరాటంలో కచ్చితంగా న్యాయం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ విలువ అక్షరాలా రూ.16.6 కోట్లు. అవును 16 కోట్ల 60 లక్షలకు ఫ్లాట్ కొనుక్కుంటే బాత్రూమ్ లో కనీసం టబ్ లేకపోతే ఎలా అని అంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పోస్టింగ్ లు పెడుతున్నారు.
ఆ లగ్జరీ అపార్ట్ మెంట్ ఎక్కడ..?
నిర్మాణ రంగంలో మంచి పేరున్న వెర్సేస్ కంపెనీ లండన్ లో అపార్ట్ మెంట్లు నిర్మిస్తోంది. ఆ సంస్థ వద్ద మి సుక్ పార్క్ అనే ఓ మహిళ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ఆమె అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఎయ్ కాన్ లండన్ వన్ టవర్ అనేది అపార్ట్ మెంట్ పేరు. నైన్ ఎల్మ్స్ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ధేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం లగ్జరీ విల్లాలకు పెట్టింది పేరు. అందులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ కావడంతో పార్క్ 16.6 కోట్లకు అపార్ట్ మెంట్ కొన్నారు.
మొదటి నుంచీ వివాదాలే..
అపార్ట్ మెంట్ కొనుగోలు విషయంలో మొదటి నుంచీ పార్క్ ని యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అపార్ట్ మెంట్ లో 2 బెడ్ రూమ్ ల ఇల్లు, పార్కింగ్ స్థలం కోసం ఆమె ముందుగా 4.2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లంచింది. దీనికోసం ఆమె తనకున్న పాత ఇంటిని కూడా అమ్మేసింది. ఈ అపార్ట్ మెంట్ ని 2022లో పూర్తి చేసి ఇస్తామన్నారు కానీ, అప్పటికి నిర్మాణం కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత 2022కి డెడ్ లైన్ పెట్టారు.
మళ్లీ సమస్యలు..
అపార్ట్ మెంట్ హ్యాండోవర్ చేసిన తర్వాత ఆమెకు అసలు విషయం అర్థమైంది. ముందుగా అనుకున్నట్టుగా ఆ అపార్ట్ మెంట్ లేదు. అందులో ఒక బెడ్ రూమ్ చిన్నదిగా ఉంది. అందులోని బాత్రూమ్ లో బాత్ టబ్ లేదు. దీంతో ఆమె అవాక్కైంది. 16 కోట్ల 60 లక్షలు పెట్టి అపార్ట్ మెంట్ కొంటే దాంట్లో బాత్ టబ్ లేకపోవడమేంటని ఆమె సదరు సంస్థ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె కోర్టుమెట్లెక్కారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి.
అపార్ట్ మెంట్ల నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లు అరచేతిలో స్వర్గం చూపించడం మన దగ్గర సర్వ సాధారణం. ముందు చెప్పింది ఒకటి, తర్వాత ఇచ్చేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది మన దగ్గర వ్యవహారం. కస్టమర్లు మోసపోయినా ఇక్కడ కోర్టుకెళ్లడం వంటి పనులు పెద్దగా జరగవు. కాంట్రాక్టర్లే ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి వ్యవహారం ముగించేస్తారు. కానీ లండన్ లాంటి ప్రాంతంలో అది కూడా లగ్జరీ అపార్ట్ మెంట్లు ఉండే చోట ఇలాంటి మోసం ఎందుకు జరిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. సదరు నిర్మాణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తోంది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది.